బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారా..? రైతు రుణమాఫీ కోసం చేస్తున్న ఆందోళనల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన వారిపై ఫోకస్ చేశారా..? కాంగ్రెస్ నేతల ఒత్తిళ్లతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారా..? అంటే.. పరిస్థితులను చూస్తే అవుననే తెలుస్తున్నది. రుణమాఫీపై రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆందోళనలను కట్టడి చేసేందుకు కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తెస్తుండడంతో పోలీసులు ఒక్కొక్కరిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగతా వాళ్ల కోసం గాలిస్తున్నట్టు సమాచారం అందుతున్నది.
కరీంనగర్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): రుణమాఫీ విషయంలో రైతుల నుంచి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్నది. ఇది రోజురోజుకూ ఉధృతమవుతున్నది. రైతులకు బీఆర్ఎస్ తోడైతే భవిష్యత్తులో మరింత తీవ్ర రూపు దాల్చే ప్రమాదం ఉందని ప్రభుత్వ నేతలు భావించి, ఆదిలోనే ఉక్కుపాదం మోపాలని చూస్తున్నట్టు తెలుస్తున్నది.
తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన ఆందోళనలకు రైతుల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర చేసిన అనంతరం దహనం చేస్తున్న సందర్భంలో పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితిని అదుపు చేసే క్రమంలో పోలీసులు మాజీ ఎమ్మెల్యే రవిశంకర్తోపాటు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులను అదుపులోకి తీసుకుని వ్యక్తిగత పూచీకత్తుపై వదిలేశారు. ఎక్కడి వాళ్లు అక్కడికి వెళ్లిపోయారు.
ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆందోళన సద్దుమణిగిన తర్వాత పోలీసులు అరెస్టులకు దిగడం చర్చనీయాంశంగా మారింది. రాత్రి సమయంలో ఓ నాయకుడిని అరెస్టు చేయడం కలకలం రేపింది. అయితే కాంగ్రెస్ నాయకులు జోక్యం చేసుకోవడంతోనే తమ పార్టీ నాయకులను అరెస్టు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
నిజానికి మధ్యాహ్నం జరిగిన ఘటనలు అంత సీరియస్గా ఉంటే అప్పుడే అదుపులోకి తీసుకొని కేసులు పెట్టే అవకాశముండేదని, కానీ, గురువారం రాత్రి ఎందుకు అరెస్టులు చేయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.
గురువారం మధ్యాహ్నం జరిగిన ఆందోళనలో క్రియాశీలకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డిని ఇదే రోజు రాత్రి కరీంనగర్లో టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న చొప్పదండి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆరెల్లి శేఖర్ ఆచూకీ లభించడం లేదని, ఆయనను కూడా పోలీసులే అరెస్ట్ చేసి ఉంటారని బీఆర్ఎస్ నాయకులు అనుమానిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఏనుగు రవీందర్ రెడ్డిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేయడం ఏమిటనేది అర్థంకాకుండా ఉండగా.. పాత కేసుల్లో అతన్ని అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. ఆయనపై చొప్పదండిలో పోలీసులతో వాగ్వాదం కేసు కూడా నమోదు చేసి ఉంటారని బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు.
బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, కొండగట్టు దేవస్థానం మాజీ డైరెక్టర్ గన్ను శ్రీనివాస్ రెడ్డిని కూడా చొప్పదండి పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. వీరిద్దరు ఇప్పుడు ఇదే పోలీసు స్టేషన్లో ఉన్నట్లు తెలుస్తున్నది. చొప్పదండి నిరసనలో పాల్గొన్న ఆర్నకొండ సింగిల్ విండో చైర్మన్ మినుపాల తిరుపతి రావుతో పాటు మరి కొందరిపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.
గంటన్నరపాటు నిర్బంధించి..
చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని గంగాధర పోలీసులు మల్యాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొరండ్ల నరేందర్ రెడ్డిని గంటన్నర పాటు స్టేషన్లో నిర్బంధించారు. కారణం లేకుండా నిర్బంధించడంతో మీడియా వెళ్లి విచారించగా.. వేరే సాకులు చెప్పి వదిలేశారు. కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లికి చెందిన నరేందర్ రెడ్డి బుధవారం ఇదే మండలం పరిధిలోని పూడూరులో జరిగిన రైతుల ఆందోళనలో క్రియాశీలకంగా పాల్గొన్నారు.
దీన్ని దృష్టిలో పెట్టుకునే అదుపులోకి తీసుకుని వదిలేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. సొంత పనిపై కరీంనగర్ వెళ్లిన నరేందర్ రెడ్డి రాకకోసం దాదాపు మూడు గంటల పాటు గంగాధర పోలీసులు కాపుకాచీ మరీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మల్యాల మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేసిన నరేందర్ రెడ్డి తన కారుపై ఇప్పటికీ మార్కెట్ కమిటీ చైర్మన్ పేరుతో ఉన్న బోర్డును ఉపయోగిస్తున్నాడని, దీనిని తొలగించాలని చెప్పేందుకే పోలీసు స్టేషన్ తీసుకెళ్లామని పోలీసులు చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నది. నిజానికి నరేందర్ రెడ్డి పూడూర్ ఆందోళనలో క్రియాశీలకంగా పాల్గొన్న కారణంగా భయానికి గురి చేసేందుకే పోలీసులు ఈ చర్యకు దిగినట్లు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితోనే : జీవీఆర్
కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితోనే తమ నాయకులను పోలీసులు అరెస్టు చేస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు స్పష్టం చేశారు. రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఇలాగే కొనసాగితే తమ ప్రభుత్వ ఉనికి ప్రమాదమనే భయానికి గురవుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు పోలీసులపై ఒత్తిళ్లు తెచ్చి తమ పార్టీ నాయకులను అరెస్టు చేయిస్తున్నారని ఆరోపించారు. అరెస్టులు, కేసులు తమకు కొత్తకాదని, తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులను ఎదుర్కొని రాష్ర్టాన్ని సాధించుకున్నామని, ఇప్పుడు కూడా చట్ట పరిధిలో కేసులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.