కార్పొరేషన్, జూన్ 22: కరీంనగర్ (Karimnagar) నగరపాలక పాలక సంస్థలో డివిజన్ల విభజన ప్రభుత్వ నిబంధనల మేరకు జరగాలని, లేనట్లయితే కోర్టును ఆశ్రయిస్తామని మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. నగర పాలక సంస్థలో మున్సిపల్ ఎన్నికలకు అధికారులు పారదర్శకంగా పనిచేయాలని కోరారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్పొరేషన్లో నూతన డివిజన్ల ఏర్పాటుకు కనీసం 5 వేల ఓట్లు కలిగిన డివిజన్లకు మాత్రమే రూపకల్పన చేయాలని ప్రభుత్వం జీవో 269 తీసుకువచ్చిందన్నారు.
కానీ, గత కమిషనర్ ప్రభుత్వం జీవో విడుదల చేయకముందే ప్రతి నూతన డివిజన్ ఏర్పాటుకు 5,500 ఓట్ల మించకుండా రూపకల్పన చేయాలని అధికారులకు బహిర్గతం చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో 12 ఆధారంగా జీవో 269ను విడుదల చేసిందని, పారదర్శకంగా డివిజన్ల రూపకల్పనకు 2021లో కేసీఆర్ ప్రభుత్వం జీవో 12 తీసుకొచ్చిందని చెప్పారు. దీని ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ నగర డివిజన్ల ఏర్పాటుకు కేవలం 10 శాతం పెంచడం లేదా తగ్గించడం చేయాలని స్పష్టంగా ఉందని అన్నారు. జూన్ 16న జిల్లాలోని మజ్లిస్ కార్పొరేటర్లు, కార్యవర్గ సభ్యులందరూ ఓవైసీ దగ్గరకు వెళ్లారని, దీంతో ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారని చెప్పారు. డివిజన్ల ఏర్పాటు విషయమై గంటల పాటు చర్చించారని ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకముందే ఇలాంటి చర్చలు జరిపి జీవో 12ను ఉల్లంఘించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కేవలం రాజకీయ నాయకులే మాత్రమే రూపకల్పనకు దరఖాస్తులు ఇచ్చారని, నగర ప్రజలు ఎవరు కూడా డివిజన్లను ఏర్పాటు చేయాలని కోరలేదని చెప్పారు. నగర ప్రజలు కోరుకునేది పరిపాలన, మౌలిక సదుపాయాలు మాత్రమేనని, రాజకీయాల వల్లే ప్రజలు నష్టపోతున్నారని వాపోయారు. అధికారులు నిబంధనలు పాటించకుండా డివిజన్లను పునర్విభజన చేస్తే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. రాజకీయాల కోసం కాదు ప్రజల కోసం డివిజన్ ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. ఈ విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం ఆలోచించే ప్రయత్నం ఏనాడైనా చేస్తున్నారా అని ధ్వజమెత్తారు. ఓవైసీతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు జరపలేదని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. నగర అభివృద్ధిపై ఒక రోజు కూడా మాట్లాడని మంత్రి ఎన్నికల రాగానే ఇష్టనుసారంగా వ్యవహరించి ఓట్ల దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, అధికారులు పారదర్శకంగానే డివిజన్లు ఏర్పాటు చేయాలని, రాజకీయాలకు అతీతంగా రూపకల్పన చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, కెమసారం తిరుపతి, పెండ్యాల మహేష్, తూల భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.