గోదావరిఖని, మార్చి 11 : మట్టి, బూడిద రవాణాలో అక్రమాలు జరుగుతున్నవి నిజం అయినందునే తాను తడిబడ్డలతో పోచమ్మ గుడిలోకి వచ్చానని బీఆర్ఎస్ నాయకుడు కౌశిక హరి స్పష్టం చేశారు. అబద్ధమైతే కాంగ్రెస్ నాయకులు పోచమ్మ గుడిలోకి తడిబట్టలతో వచ్చే దమ్ముందా? సవాల్ విసిరారు. రామగుండం నియోజకవర్గంలో ఎన్టీపీసీ బూడిద రవాణాతోపాటు మద్దిర్యాలలో మట్టి అక్రమ తవ్వకాలు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కనుసన్నల్లో జరుగుతున్నాయని ఆరోపణలు చేసిన ఆయన మంగళవారం బహిరంగ చర్చకు వచ్చారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో గోదావరి జలాలతో స్నానం చేసి తడిబట్టలతో పోచమ్మ గుడిలోకి ప్రవేశించారు. అనంతరం ఆలయం బయట రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్‌తోపాటు ఆయన అనుచరులకు సవాల్ విసిరారు.
రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సారథ్యంలో చౌరస్తాలో బైఠాయించి పెద్దపెట్టున నినాదాలు చేశారు. రామగుండం ఎమ్మెల్యేతోపాటు ఆయన వర్గీయులు స్థానికంగా ఉన్నప్పటికీ స్పందించలేదని, అక్రమాలు నిజమనడానికి ఇదొక్కటే నిదర్శనమని కౌశికహరి విమర్శించారు. నిరాధారమైన ఆరోపణలు ఎవరు చేస్తున్నారో.. బూడిద, మట్టి అక్రమాలకు ఎవరు పాల్పడుతున్నారో తేటతెల్లం అయ్యిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు రామగుండం నియోజకవర్గంలో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఒక చీకటి సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఖని వన్ టౌన్ పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళనకారులను సముదాయించారు. అయితే ఈ ఘటనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉలిక్కిపడ్డారు. కౌశికహరి విసిరిన సవాల్‌కు రామగుండం ఎమ్మెల్యే గానీ, ఆ పార్టీ నాయకులు ఎవరూ స్పందించకపోవడంతో జనం ముక్కున వేలేసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు తోకముడిచారంటూ విమర్శలు గుప్పించారు.
రామగుండంలో అధికార పార్టీ కాంగ్రెస్ విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో జరుగుతున్న మట్టి, బూడిద దందాను తమ పార్టీ నాయకుడు కౌశిక హరి బయటపెట్టడమే కాకుండా తవ్వకాలు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి కూడా చూపించాడని, దీనిపై రామగుండం ఎమ్మెల్యే సమాధానం చెప్పకుండా తన చోటామోటా కార్యకర్తలతో తిరిగి బీఆర్ఎస్పైనే నిరాధారమైన ఆరోపణలు చేయించడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకే ఇది గొడ్డలి పెట్టన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కడమే ‘మీ ప్రతాపమా?’ అని ప్రశ్నించారు.
వ్యక్తిగత ఆరోపణలు చేయడం మానుకోవాలని, ప్రతిపక్షాలుగా తాము ప్రశ్నిస్తామని, మీ అక్రమాలు నిజం కాకపోతే నిరూపించుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? అని నిలదీశారు. వాస్తవాలను ప్రజలంతా గమనిస్తున్నారని, ప్రజల చేతిలో కాంగ్రెస్ నాయకులకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా కలెక్టర్ గానీ, మైనింగ్ అధికారులు గానీ స్పందించి అక్రమాలపై చర్యలు తీసుకుంటే కలెక్టరేట్‌తోపాటు ఇటు రామగుండం ఎమ్మెల్యే కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో మాజీ డిప్యూటీ మేయర్ అభిషేక్‌తోపాటు మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.