borehole motor | గంగాధర, ఆగస్టు 22 : కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని సర్వారెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. ఎస్సీ కాలనీలో ఉన్న బోర్ వెల్ మోటార్ చెడిపోయింది. పట్టించుకోవాల్సిన గ్రామపంచాయతీ సిబ్బంది నెలల తరబడి మోటార్ ను రిపేర్ చేయించకపోవడంతో తాగునీటి కోసం గ్రామస్తులు ఇబ్బంది పడ్డారు. మిషన్ భగీరథ నీరు సక్రమంగా రాకపోవడంతో, ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న బోరు వద్ద నుండి నీటిని తీసుకు వస్తున్నట్లు గ్రామస్తులు వాపోయారు.
నీటి సమస్యను పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శి, మండల అధికారులను కోరినా వారి నుండి స్పందన లేదని గ్రామస్తులు మండిపడ్డారు. సమస్యను తెలుసుకున్న సర్వారెడ్డిపల్లి గ్రామ బీఆర్ఎస్ నాయకుడు, సింగిల్ విండో డైరెక్టర్ కరబూజ వెంకటేశం రూ.23 వేలు వెచ్చించి కొత్త బోర్ మోటార్ ను కొనుగోలు చేశాడు. చెడిపోయిన మోటార్ స్థానంలో నూతనంగా కొనుగోలు చేసిన మోటార్‌ను శుక్రవారం అమర్చారు. తాము కోరగానే సమస్యను పరిష్కరించిన వెంకటేశంకు ఎస్సీ కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.