BRS leader | ధర్మారం, ఆగస్టు22: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, ఆ గ్రామ మాజీ సర్పంచి గంధం వరలక్ష్మి భర్త గంధం నారాయణ (53) శుక్రవారం కరంట్ షాక్ తగిలి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. నారాయణ మృతితో గ్రామంలో విషాదఛాయలు ఏర్పడగా, ఈ సంఘటన ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. నారాయణ శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో గ్రామ శివారులో ఉన్న తన పొలానికి నీరు పెట్టడానికి వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు.
నారాయణ పొలం గట్టుపై నడుచుకుంటూ బావి వద్దకు చేరుకుంటున్న క్రమంలో అప్పటికే అక్కడ మోటార్ కనెక్షన్ కు ఉండే స్టార్టర్ నుంచి బోర్డు నుంచి గట్టుపై ఇరుపక్కల కర్రలకు అమర్చిన జీఐ వైర్ ను గమనించక తాకడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. నారాయణ కు షాక్ తగిలిన సమయంలో మల్లాపూర్ లోని సబ్ స్టేషన్ లో పలుమార్లు బ్రేక్ డౌన్ అయింది. అయితే షాక్ తగిలి అతడి కాలికి తీవ్రమైన గాయమై ఉంది. కుటుంబ సభ్యులు అతనికి ఫోన్ చేయగా ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన వెంటనే ఓ స్నేహితుడితో కలిసి అతడి కుమారుడు అక్షయ్ పొలం వద్దకు చేరుకున్నాడు.
తండ్రికి కరెంటు షాక్ తగిలి మరణించి ఉన్న విషయాన్ని గమనించని అతని కొడుకు వెంటనే కదిలించాడు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో నారాయణ కొడుకు కు త్రుటిలో ప్రాణాపాయం తప్పినట్లు అయింది. కాగా సమాచారం తెలుసుకొని ఆందోళన చెందిన నారాయణ భార్య వరలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించింది. క్షణాల్లో నారాయణ ప్రాణాలు గాల్లో కలవడంతో వరలక్ష్మి తో పాటు అతడి కుమారుడు రోధించిన తీరు అందరిని కలిసి వేసింది. మృతుడు నారాయణకు భార్య వరలక్ష్మి తో పాటు కూతురు త్రిశూల, కుమారుడు అక్షయ్ ఉన్నారు. నారాయణ మృతి దేహాన్ని ఇంటి నుంచి పోస్టుమార్టం కోసం కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానకు తరలించారు.
నారాయణ మృతికి గల కారణాలను పెద్దపల్లి ప్రవీణ్ కుమార్ కు మృతుడి కుటుంబ సభ్యులు వివరించారు. తమ దగ్గరికి బంధువులపైనే అనుమానం ఉందని, పథకం ప్రకారమే జే ఐ వైర్ అమర్చి హతమార్చినట్లు అనుమానంగా ఉందని సీఐ కి వారు వివరించారు. కాగా మృతుడి భార్య వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ధర్మారం ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ తెలిపారు.