మానకొండూర్, జూన్ 26: ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపులో అర్హులకు అన్యాయం చేస్తే రణం తప్పదని, నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెడుతామని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హెచ్చరించారు. మానకొండూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లను పైసలు, పొలాలు, ఇండ్లు ఉన్నళ్లోకే కేటాయించారని మండిపడ్డారు. ఏమిలేనోళ్లకు ఒక్క ఇల్లు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పేదలకు అండగా నిలుస్తుందని, వాళ్లకు ఇండ్లిచ్చే వరకు పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. అర్హులైన నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం నియోజకవర్గ కేంద్రమైన మానకొండూర్‌లో నిర్వహించిన మహాధర్నాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రసమయి మాట్లాడారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి, పద్దెనిమిది నెలలైనా ఇచ్చిన హామీలు, గ్యారెంటీలను అమలు చేయడం లేదని విమర్శించారు.
ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మరో నాటకానికి తెరలేపాడని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను కాంగ్రెస్ కమిటీలు ఎంపిక చేయడంతో అసలైన పేదలకు అన్యాయం జరిగిందన్నారు. బెజ్జంకి మండలం గుండారంలో 26 మంది ఎస్సీ కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే ఒక్క కుటుంబానికి ఇల్లు కేటాయించక పోవడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి తన సొంత గ్రామం అని చెప్పుకుంటున్న పచ్చునూర్లో ఎంతమంది ఎస్సీ కుటుంబాలకు ఇండ్లు కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం వారి పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇండ్లు ఇచ్చారని విమర్శించారు.
ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా 48వేల మంది లబ్ధిదారులను అర్హులుగా ఎంపిక చేసి ఆయా గ్రామ పంచాయతీల్లో జాబితా ప్రకటించారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు కేవలం 3500 మందికి మాత్రమే ఇండ్లు మంజూరైనట్లు ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మంజూరైన లబ్ధిదారుల్లో అసలైన నిరుపేదలు ఎక్కడా లేరని వెల్లడించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన లబ్ధిదారుల జాబితాపై సమీక్ష చేయాలని హితవు పలికారు.
అప్పుడే వాస్తవాలు బయటపడుతాయని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, సిద్దం వేణు, లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, సింగిల్‌విండో చైర్మన్లు, సీనియర్ నాయకులు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, ఉల్లెంగల ఏకానందం, సంజీవరెడ్డి, శాతరాజు యాదగిరి, ఎరుకల శ్రీనివాస్‌గౌడ్, గూడూరి సురేశ్, బీఆర్ఎస్వీ నియోజక కన్వీనర్ గుర్రం కిరణ్‌గౌడ్, కార్యదర్శి మర్రి అశోక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
దద్దరిల్లిన మహాధర్నా
మానకొండూర్ పల్లెమీది చౌరస్తా దద్దరిల్లింది. బీఆర్ఎస్ మహాధర్నాతో హోరెత్తింది. ఇందిరమ్మ ఇండ్లను అర్హులకు ఇవ్వాలని, నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేయొద్దని డిమాండ్ చేస్తూ గురువారం భారీ ఆందోళన చేపట్టగా, నినాదాలతో అట్టుడికింది. మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్తోపాటు నియోజకవర్గ నలుమూలల నుంచి గులాబీ దళం, పేద ప్రజానీకం తరలివచ్చి నిరసన తెలిపింది. కాంగ్రెస్ సర్కారు తీరును ఎండగట్టింది. నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేయగా, కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం చూపారు. మహాధర్నాను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ను దూషిస్తూ నినాదాలు చేస్తూ కరీంనగర్- వరంగల్ రహదారిపై ర్యాలీగా బయలుదేరి వేదిక వద్దకు రావడం, కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పొలీసులు అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు.
రాష్ట్రంలో ఫ్యాక్షన్ పాలన
కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం కరువైంది. రాష్ట్రంలో ఫ్యాక్షన్ పాలన నడుస్తున్నది. అర్హులైన నిరుపేదల పక్షాన పోలీసుల అనుమతితో శాంతియుతంగా ధర్నా చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నించడం సరికాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఆరు గ్యారెంటీలు, హామీలు అమలు చేయాలి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక అధికారుల సమక్షంలో చేయాలి. కానీ, దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా కాంగ్రెస్ కమిటీలు సెలక్ట్ చేయడం సిగ్గుచేటు.
– జీవీ రామృకష్ణారావు, బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు
ఇది ట్రైలర్ మాత్రమే
నిరుపేదలకు అన్యాయం చేస్తే ఊరుకోం. ప్రభుత్వాన్ని ఇలాగే నిలదీస్తాం. ఇది ట్రైలర్ మాత్రమే. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, హామీల అమలుపై రాబోయే కాలంలో సర్కారుతో తాడోపేడో తేల్చుకుంటాం. కాంగ్రెస్ నాయకుల కవ్వింపు చర్యలకు భయపడం. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా చేస్తున్న ధర్నాను ఆపాలని, దాడిచేయాలని ప్రయత్నించడం వారి కుటిల బుద్ధికి నిదర్శనం. మాకు కేసులేమి కొత్త కాదు. తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తేలేదు. రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసి జైలు జీవితం గడిపాం. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయి. అర్హులకు కాకుండా భూములు, బిల్డింగ్లు, ఉద్యోగాలు ఉన్న వారికి ఇండ్లు ఇచ్చిన్రు. ఇండ్ల జాబితాపై మళ్లీ సమీక్ష చేసి అసలైన అర్హులకు కేటాయించాలి.
– సిద్దం వేణు, సిరిసిల్ల మాజీ జడ్పీ చైర్మన్
నాకు గుంట జాగలేదు
నేను నా భార్త కూలీపనులు చేసుకుంట బతుకుతం. నాకు గుంట జాగలేదు. ఇల్లు లేదు. కిరాయి ఇంట్లో ఉంటున్న. ఇందిరమ్మ ఇల్లు వస్తదంటే దరఖాస్తు చేసుకున్న. మా ఊర్ల ఇండ్లు ఉన్నోళ్లకు, పొలాలు ఉన్నాళ్లోకే మళ్లీ ఇందిరమ్మ ఇండ్లు వచ్చినయి. కానీ, మాకు ఏది లేకున్నా రాలేదు. ఎమ్మెల్యే ఆఫీస్ చుట్టూ తిరిగినా మాకు న్యాయం జరుగలే.
– బత్తుల భార్గవి, ఖాసీంపేట (బెజ్జంకి మండలం)