కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 23: ‘కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖబడ్దార్. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శిస్తే ఊరుకోబోం’ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు సరెండరై కాళేశ్వరంపై ఇష్టంవచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా సంజయ్ పట్టనట్లు ఉన్నారని మండిపడ్డారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు హోటల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రిగా తెలంగాణకు న్యాయం చేయడంలో బండి సంజయ్ విఫలమయ్యారని ఆరోపించారు.
కాళేశ్వరంపై మాది మోడీ స్టాండ్, అమిత్ షా స్టాండ్ అని అంటున్న సంజయ్, తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వకపోవడమే మీ స్టాండా..? అని ప్రశ్నించారు. పీఎంగా మోదీ తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని, ఒక మెడికల్ కాలేజ్, ఒక ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వలేదని విమర్శించారు. బనకచర్లకు కేంద్రం నిధులు కేటాయిస్తున్నందున ఆ ప్రాజెక్టుకు నీళ్లు పోవాలని వారికి మద్దతుగా బండి సంజయ్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కాళేశ్వరం తెలంగాణకు ఒక గొప్ప ప్రాజెక్ట్ అని, దీనిపై విషం కక్కడం మానుకోవాలని హితవుపలికారు.
సంజయ్‌కి వ్యవసాయం గురించి కనీసం తెలియకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నీళ్ల మీద కనీస అవగహన లేకుండా మాట్లాడుతున్నారని, ఎంత సేపు మరొకరిపై తప్పుడు ఆరోపణలు, రెచ్చగోట్టే ప్రకటనలు తప్ప బండికి మరో ఆలోచన రాదని దుయ్యబట్టారు. మండుటెండల్లోనూ తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిండు కుండల్లా చెరువులను మార్చింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదా..? అని ప్రశ్నించారు. సంజయ్‌కు సబ్జెక్ట్ తెలియకుంటే వారి బీజేపీ నాయకుడు విద్యాసాగర్‌రావు వద్దకు వెళ్లి ట్రైనింగ్ తీసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డితో బండి కుమ్మక్కై ఆయన చెప్పిన మాటలే మాట్లాడుతున్నారని విమర్శించారు.
హోం శాఖ సహాయ మంత్రులు ఆయనతోపాటు నిత్యానందరాయ్ ఉన్నారని, వారు ఫోర్సెస్ శాఖకు వెళ్లి పనులు చేస్తున్నారని, మరి సంజయ్ ముఖానికి ఒక శాఖ, అధికారుల వద్దకు ఏనాడైనా పోయాడా..? కనీసం తన పరిధిలో ఎన్ని శాఖలు ఉన్నాయో..? తెలుసా అని ప్రశ్నించారు. కరీంనగర్ సెగ్మెంట్లో సెకండ్ క్యాడర్లో ఎవరినీ ఎదగనివ్వలేదని, అతని గురువు సుగుణాకర్‌రావు, రామకృష్ణారెడ్డి, అర్జున్‌రావును పక్కన పెట్టాశారని విమర్శించారు. సంజయ్ తన వైఖరి మార్చుకోవాలని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని, ప్రజలు నడ్డి విరగగొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు. సమావేశంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.