జమ్మికుంట, అక్టోబర్ 27: బీఆర్ఎస్ గెలుపును ఏ శక్తీ అడ్డుకోలేదని, రాష్ట్రంలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ ఖాయమని బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. గ్రామాల్లో యువత ఒక సైనికుల్లా పనిచేయాలని, గెలుపంతా మీ చేతుల్లో ఉందని పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆ పార్టీ అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి ఏర్పాటు చేయగా, శుక్రవారం ఆయనతో కలిసి ఇన్చార్జి పెద్దిరెడ్డి ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ‘యువ గర్జన’ పేరిట యువతతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. పనిచేసే యువకుడు, సమస్యలను పరిష్కరించే నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డిని గెలిపించుకోవాలని, హుజూరాబాద్‌లో గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ గెలుస్తుందని సర్వేలు చెప్పాయని, కేవలం మెజార్టీ కోసమే పోటీ పడాలని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉద్యమాల గడ్డ అని, చైతన్యానికి మారుపేరని, ఎన్నికల రణరంగంలో దిగిన తర్వాత గెలిచి తీరాల్సిందేనన్నారు. కౌశిక్ ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని వర్గాలను కలిశారని, మరోసారి అందరం కలుసుకుందామని చెప్పారు. అయితే నాయకులు, కార్యకర్తలు ఎక్కడివారు అక్కడే ప్రచారం చేయాలని, పార్టీ కోసం పాటుపడాలని కోరారు.
ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మి మోసపోవద్దని, అరిగోస పడ్తమని సూచించారు. హుజూరాబాద్ జిల్లా ఎన్నడో అయ్యేదని, జిల్లా కాకుండా అడ్డుకున్నదెవరో ప్రజలకు తెలుసన్నారు. జిల్లా ఏర్పడితే ఎన్నో సౌకర్యాలు వచ్చేవని పేర్కొన్నారు. అయినా, ప్రజల ఆకాంక్షను సీఎం దృష్టికి తీసుకెళ్లానని, మంచి సమయంలో సీఎం నుంచి మంచి నిర్ణయం వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో సీఎంగా కేసీఆర్ ఉంటే.. ఇక్కడ వేరే పార్టీ నాయకుడిని గెలిపించుకుంటే అభివృద్ధి జరగదని తెలిపారు. హుజూరాబాద్ మరోసారి నష్టపోవద్దంటే.. ప్రగతి సాధించాలంటే బీఆర్ఎస్ను గెలిపించుకు తీరాలన్నారు. కుల రాజకీయాలు చేసే నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
నా బలం.. బలగం మీరే. 30 రోజులు నా కోసం పనిచేయండి. ఐదేళ్లు నేను మీ కోసం పనిచేస్తా. మాట తప్ప. మడమ తిప్ప. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంట. ఎక్కడి వాళ్లు అక్కడే పనిచేయాలి. ప్రతి గ్రామంలో మీరే కథానాయకులు కావాలి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి. అంతిమంగా విజయం మనదే కావాలి. దేశ చరిత్రలో 37 వేల కోట్లు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఎక్కడా లేదు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, 24 గంటల ఉచిత కరెంటు ఎందుకియ్యడం లేదు? కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రమంతా సస్యశ్యామలమైంది. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో బాగున్నది. ప్రజా వ్యతిరేక ప్రతిపక్షాలు మనకు అవసరం లేదు. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తా. వావిలాల, చల్లూరు, శనిగరం, ఉప్పల్‌ను మండలాలుగా, కమలాపూర్‌ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తా. కాంగ్రెస్, బీజేపీ సర్వేల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని తేలింది. మెజార్టీ కోసం పనిచేయాలి.
– పాడి కౌశిక్‌రెడ్డి, బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి, మండలి విప్
స్వరాష్ట్రం కోసం కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో ఉద్యమానికొచ్చినం. దెబ్బలు తిన్నం. జైళ్లకెళ్లినం. రాష్ర్టాన్ని సాధించుకున్నం. సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ గొప్పగా తీర్చిదిద్దుతున్నరు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిస్తున్నరు. మేమంతా ఉద్యమ బిడ్డలం. పనిచేస్తూనే ఉంటం. గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకుంటం. కాపాడుకుంటం. హుజూరాబాద్‌లో గెలిపించుకుంటం. మాకు పదవులొద్దు. మాకేమన్న కష్టమొస్తే మేమున్నామంటే చాలు..
– జువ్వాజీ కుమార్, బీఆర్ఎస్ నాయకుడు (ఇల్లందకుంట)
కౌశిక్ అన్న ఒక్క పిలుపిస్తే చాలు.. ఇక్కడికచ్చినం. నియోజకవర్గంలోని యువతంతా బీఆర్ఎస్తోనే ఉన్నది. ఉంటం కూడా. పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేస్తం. గ్రామాల్లోనే తిరుగుతం. పథకాలను వివరిస్తం. గతంలో జరిగిన పొరబాటు ఈసారి జరుగకుండా చూసుకుంటం. ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతం.
– అనురాగ్, బీఆర్ఎస్ యువ నాయకుడు (హుజూరాబాద్)
బీజేపీ, కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పార్టీలు. వచ్చే ఎన్నికల్లో వాటిని తరిమికొట్టాలి. కాంగ్రెస్ రైతుబంధుపై ఈసీకి ఫిర్యాదు చేయడం సిగ్గుచేటు. రైతులు బాగుపడుతుంటే ఓర్వలేకపోతున్నది. ప్రజల్లో చైతన్యం కలిగించాలి. ప్రభుత్వ పథకాలను వివరించాలి. యువకుడు పాడి కౌశిక్‌రెడ్డిని గెలిపించుకుందాం. హుజూరాబాద్‌కు భవిష్యత్ ఉంటది. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు అభ్యర్థులనే ప్రకటించలేదు. అసలు పోటీ చేస్తారో లేదో తెలియదు. మనమంతా కలిసికట్టుగా పనిచేయాలి. హుజూరాబాద్ గడ్డపై గులాబీ జెండాను ఎగురవేయాలి.
– బండ శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్
యువత చేతిలోనే భవిష్యత్ ఉంది. కౌశికన్న ఇచ్చిన పిలుపుతో ఈరోజు ఇంత మంది రావడం అభినందనీయం. మనం ఇలాగే ముందుకు సాగాలి. ఎక్కడి వారు అక్కడే ఉండాలి. గ్రామాల్లో తిరగాలి. ప్రజలతో మమేకం కావాలి. చర్చ పెట్టాలి. సంక్షేమం, అభివృద్ధిని వివరించాలి. ఎన్నికలు పూర్తైయ్యేంత వరకు నిద్రపోవద్దు. ప్రతి కార్యకర్త ఒక కథానాయకుడు కావాలి. వ్యక్తిగత ప్రతిభను చూపాలి. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి.
– పింగిళి రమేశ్, కేడీసీసీబీ వైస్ చైర్మన్
పార్టీలు వస్తుంటయ్. పోతుంటయ్. ఎప్పటికీ ఉండేది.. పనిచేసే బీఆర్ఎస్ ఒక్కటే. పనిచేసే పార్టీని కాపాడుకుంటం. అందుబాటులో ఉండే కౌశికన్ననే గెలిపించుకుంటం. సీఎం మ్యానిఫెస్టో అదిరింది. ప్రతిపక్షాల దిమ్మతిరిగింది. మూడోసారి సీఎం కేసీఆరే. ఇక్కడికచ్చిన యువతంతా యుద్ధంలోని సైనికుల్లా పనిచేయాలి. పనిచేస్తం కూడా. పెద్దలు అందించే దిశానిర్దేశాన్ని పాటిస్తూ ఐక్యతతో ముందుకు సాగుతాం.
-శివ, హుజూరాబాద్, బీఆర్ఎస్ యువ నాయకుడు