కరీంనగర్ కార్పొరేషన్, మే 5: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు విమర్శించారు. కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య రాజకీయాల్లో విమర్శలు విధానాలపై, ప్రజా సమస్యలపై ఉండాలే తప్ప వ్యక్తిగతంగా దూషణలు చేయడం అనైతికమన్నారు. కేసీఆర్ కుమారుడని నిరూపించుకోవాలని కేటీఆర్‌పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతకరమని మండిపడ్డారు. హైదరాబాద్‌లో భూకబ్జా వ్యవహారాలపై కేటీఆర్ చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వలేక, అలాగే రేవంత్‌రెడ్డితో కుమ్మకయ్యారన్న ఆరోపణలపై స్పందించలేక వ్యక్తిగత విమర్శలకు దిగడం ఆయన అసహనాన్ని, బలహీనతను బయటపెడుతోందని తెలిపారు.
కాళేశ్వరం, ఫార్ములా ఈ, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలపై బండి సంజయ్ ఎన్నోసార్లు ఆరోపణలు చేసినప్పటికీ కేటీఆర్ ధైర్యంగా సమాధానాలు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ, తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పలేక బండి సంజయ్ వ్యక్తిగత దూషణలకు దిగడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి భాష అతనిపై వాడితే ఎలా ఉంటుందో ఆయన ఆలోచించాలని హితవుపలికారు. రాష్ట్రానికి బీజేపీ ఎంపీలు ఉన్నారనే పేరే గానీ, రాష్ట్ర హకుల కోసం పోరాడిన చరిత్ర కనిపించడం లేదన్నారు. రాష్ర్టానికి అన్యాయం జరుగుతున్నప్పుడు గళం విప్పకపోవడం వారి రాజకీయ బలహీనతను బయటపెడుతోందన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కొత్త ప్రాజెక్టులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ, బీజేపీ నాయకులు నిశ్శబ్దంగా ఉండడం బాధ్యతారాహిత్యమన్నారు.