జగిత్యాల కలెక్టరేట్, జులై 13 : సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం రాత్రి 7గంటల తర్వాత ఫిర్యాదు చేసేందుకు టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ముందస్తు సమాచారంతో స్టేషన్‌కు వస్తే పోలీస్ అధికారులు అందుబాటులో లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, నాయకులతో కలిసి స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
కేటీఆర్ స్వయంగా కన్నెపల్లి పంపుహౌస్‌ను సందర్శించి నీటిని ఎత్తిపోయాలని విన్నవించినప్పటికీ స్పందించకుండా సీఎం నెత్తురు పీల్చే రక్త పిశాచిలా, జలగలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నీటిని ఎత్తిపోయాలని కోరితే రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు నెత్తురు చల్లితే పంటలు పండుతాయనడాన్ని ఖండించారు. ‘రక్తం చల్లాలి’ అని పిలుపునివ్వడం నిందితుడు ప్రజల్లో హింసను రెచ్చగొట్టడమే కాకుండా వారి ప్రాణాలు, భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగించడమేనన్నారు. ప్రతిపక్ష నేతలను బండరాళ్లు కట్టుకుని ప్రాజెక్టులో దూకి చావమనడం స్పష్టంగా ఆత్మహత్యకు ప్రేరేపించడమే అవుతుందని తెలిపారు.
నిరసన విషయం తెలిసి సీఐ వెంటనే అక్కడకు చేరుకొని, జీవన్‌రెడ్డి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు రాజకీయ పార్టీకి వంతపాడుతున్నట్టుగా వ్యవహరించవద్దని, రోడ్డెక్కే పరిస్థితి రావడానికి సీఐ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విద్వేషపూరిత ప్రసంగాలు, హింసను ప్రేరేపించే విషయాల్లో వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టమైన ఆదేశాలిచ్చిందని గుర్తు చేశారు. ఇలాంటి సందర్భాల్లో ఫిర్యాదు కోసం వేచి చూడకుండా సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.