KARIMNAGAR BRS | కరీంనగర్ : కరీంనగర్ లో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడకలు ఘనంగా నిర్వహించారు. ఊరూరా పార్టీ జెండాను ఆవిష్కరించారు. కరీంనగర్ లోని చింతకుంటలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జెండా ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలతో కలసి ఎల్కతుర్తి సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో బస్సుపైకి ఎక్కి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాలు, వివిధ గ్రామాల్లో ఆయా శాఖల బాధ్యులు జెండాలు ఆవిష్కరించారు. డీజే సౌండ్ డప్పుల చప్పుళ్లతో గ్రామాలు, పట్టణాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. కరీంనగర్ రూరల్ మండలం చెర్లభూత్కూర్ లో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. వివిధ జిల్లాల నుంచి పొద్దటి నుంచే తరలి వస్తున్న వాహనాలతో రోడ్లు బిజీగా మారిపోయాయి. కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారి పొడవునా కార్యకర్తలు, నాయకులు సేద తీరుతూ కనిపించారు.
కార్పొరేషన్ లో…
కార్పొరేషన్ : వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కరీంనగర్ నుంచి మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు ఉదయమే బయలుదేరి వెళ్లారు. ఈ బస్సుల ర్యాలీకి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వెళ్తున్నట్లు తెలిపారు. భవిష్య చరిత్రలో కని విని ఎరుగని పేరులో ఈ సభ జరగనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్, ఏనుగు రవీందర్, బీఆర్ఎస్ నాయకులు హరిశంకర్, సూర్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.