సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 18 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు అపరభగీరథుడు అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేశారని కొనియాడారు. ఈ మేరకు మంగళవారం సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి చెప్పిన మాటలే మళ్లీ చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో జిల్లాకు సాగునీరు అందడంలేదని చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. మండుటెండల్లోనూ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ ప్రాజెక్టుల నుంచి కూడెల్లి వాగు ద్వారా ఎగువ మానేరుకు చేరుకుని, అక్కడ అలుగుదుంకిన నీరు సిరిసిల్ల మానేరు బ్రిడ్జి కిందకి వచ్చాయని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన బ్లాక్‌ను మరమ్మతు చేయకుండా కేసీఆర్‌ను బదనాం చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అత్యంత నీచమైన భాషను మాట్లాడే రేవంత్‌రెడ్డి నోరు మూసీ నది కంటే మురికిగా ఉంటుందన్నారు. వేములవాడ గుడి చెరువుకు 30 ఎకరాలు సేకరించి లిఫ్ట్ తెచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు.
ఒకప్పుడు ఉరిశాలగా ఉన్న సిరిసిల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపిన గొప్ప నాయకుడు కేటీఆర్ అని అభివర్ణించారు. మిడ్ మానేరు ప్రాజెక్టును పూర్తి చేసి తంగళ్లపల్లి బ్రిడ్జి కిందకు నీళ్లు తెచ్చి ప్రజల రుణం తీర్చుకున్నారని పేర్కొన్నారు. తంగళ్లపల్లి నుంచి ఇల్లంతకుంట వరకు సాగు నీటిని అందించారన్నారు. ‘రంగనాయకసాగర్ చార్ సౌ బీస్ రేవంత్‌రెడ్డి బాపు నిర్మించిండా?’ అని ప్రశ్నించారు. మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్న పార్టీ నాయకుడు కేకే మహేందర్‌రెడ్డి విమర్శలు చేసే ముందు పునరాలోచన చేసుకోవాలని హితవుపలికారు.
ప్రజలకు కాంగ్రెస్‌పై విశ్వాసం పోయిందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు. సాగు నీరు లేక ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, నాయకులు గజభీంకార్ రాజన్న, వెంగళ శ్రీనివాస్, కుంభాల మల్లారెడ్డి, కొండ శంకర్, పోచవేని ఎల్లయ్యయాదవ్, బింగి ఇజ్జగిరి పాల్గొన్నారు.