బీఆర్ఎస్ మరోసారి పోరు బాటపట్టింది. రుణమాఫీ పేరిట ధోఖా ఇచ్చిన కాంగ్రెస్ సర్కారుపై కొట్లాటకు దిగుతున్నది. ఈ నెల 15వ తేదీలోగా ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి, వేలాది మందికి ఎగనామంపెట్టడంపై ఆగ్రహిస్తున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు గురువారం నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలకు గులాబీదళం సిద్ధమైంది. రైతులతో కలిసి ధర్నాలు చేసి, ప్రభుత్వ తీరును ఎండగట్టనున్నది.
కరీంనగర్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎన్నికల ముందు ఏకకాలంలో 2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు రైతులకు ధోఖా చేసింది. ఎంతో ఆశతో ఎదురుచూసిన అన్నదాతలకు ఎగనామం పెట్టింది. మొదటి, రెండో, మూడో విడుతలో అనేక కొర్రీలు పెట్టి వేలాది మంది నోట్లో మట్టికొట్టింది.
రుణమాఫీ కాకపోవడంతో రైతులు ఆగమైపోతూ, బ్యాంకులు, ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో నిరాశే మిగులుతున్నది. ఈ క్రమంలో మోసపోయిన రైతన్నకు బీఆర్ఎస్ మరోసారి అండగా నిలుస్తున్నది. ఎండకాలంలో సాగునీటి కోసం, పంట కొనుగోళ్ల కోసం తండ్లాడిన సందర్భాల్లో రైతు పక్షాన నిలిచి నిరనస తెలిపింది. ఇప్పుడు రుణమాఫీ కోసం ఆగవుతున్న తరుణంలో సర్కారు తీరును ఎండగట్టి, రైతులకు న్యాయం చేసేందుకు నడుంబిగించింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గురువారం నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేయబోతున్నది. కాగా, కాంగ్రెస్ సర్కారు మోసపూరిత వైఖరికి నిరసగా చేపట్టబోయే ధర్నాలను విజయవంతం చేయాలని మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్తోపాటు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు కోరుతున్నారు. రైతులతోపాటు రైతు సంఘాల నాయకులు, గులాబీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. రుణమాఫీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేసిందని మండిపడ్డారు. రైతుల పక్షాన ఎంతకైనా తెగిస్తామని, రుణమాఫీ అందరికీ అమలు చేసేదేకా వదిలేది లేదని స్పష్టం చేశారు.