కోల్ సిటీ : రామగుండం నగర పాలక సంస్థలో కీలకమైన పారిశుధ్య విభాగాన్ని ( Sanitation Department ) ప్రక్షాళన చేయాలని 58వ డివిజన్ కార్పొరేటర్, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్ ( Sammaiah Yadav ) , 60 డివిజన్ కార్పొరేటర్ మేకల శారద ( Saradha ) కోరారు. ఈమేరకు కౌన్సిల్ సమావేశం అనంతరం కమిషనర్ జే. అరుణ శ్రీని కలిసి ఫిర్యాదు చేశారు.
కార్పొరేషన్ రికార్డులో ఉన్నట్టు 448 మంది శానిటేషన్ కార్మికులు క్షేత్ర స్థాయిలో పని చేయడం లేదనీ, అధికారులు, ప్రజాప్రతినిధుల సొంత పనులకు డ్యూటీలు వేస్తున్నారని ఆరోపించారు. తమ డివిజన్‌కు చెత్త సేకరణ ట్రాలీ రావడం లేదని, శానిటేషన్ అధికారులకు ఫోన్ చేస్తే ఏమాత్రం స్పందించడం లేదన్నారు.
58 డివిజన్లో ఏడాదిన్నర కిందట రోడ్డు అభివృద్ధి అంటే తామే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇళ్లను కొంతభాగం తొలగించుకున్నామని, ఇప్పటివరకు రోడ్డు పనులు చేపట్టిన పాపాన పోలేదన్నారు. డివిజన్లో చెత్త సేకరణకు కేవలం ఒకటే ట్రాలీ కేటాయించారనీ, ఒక్కసారి చెత్త తీసుకువెళ్తే వారం వరకు ట్రాలీ రావడం లేదని ఆరోపించారు. డివిజన్లో చెత్తంతా పేరుకపోయి దుర్గంధంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పారిశుధ్య లోపంపై ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామన్నారు.