కరీంనగర్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : జన హృదయ నేత, స్వరాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు అంబరాన్నంటాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పండుగలా సాగాయి. బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వృక్షార్చనలో భాగంగా మొక్కలు పంపిణీ చేసి, నాటారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడంతోపాటు నిరుపేదలకు నిత్యావసర సరుకులు, దవాఖానలు, ఆశ్రమాల్లో పండ్లు పంపిణీ చేశారు. కేకులు కోసి, స్వీట్లు పంచారు. పలుచోట్ల అన్నదానాలు చేయగా, పలువురు వినూత్నంగా నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నిండునూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, శతమానం భవతి అంటూ కాంక్షించారు. కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కేక్ కట్ చేశారు.
అనంతరం మొక్కలు పంపిణీ చేశారు. హుజూరాబాద్ కేసీ క్యాంపులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సుదర్శన హోమం నిర్వహించారు. అలాగే గోదావరిఖనిలోని శ్రీ జయదుర్గాదేవి ఆలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆయుష్ హోమం నిర్వహించారు. రామానంద భారతి మహాస్వామి, శ్రీరాంభట్ల శివ శర్మ సమక్షంలో 25 మంది రుత్వికులు పాల్గొన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రత్యేక పూజలు చేశారు.
రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల, ప్రభుత్వ దవాఖానలో 71 మందితో రక్తదానం, 71 మొక్కలు పంపిణీ, 71మంది సింగరేణి రిటైర్డు కార్మికులకు సన్మానం చేయగా, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కల్పించారు. కోరుట్ల మండలంలోని పైడిమడుగులో బీడీ కార్మికులు కేసీఆర్ చిత్రపటానికి పూలతో అభిషేకం చేసి, ‘కేసీఆర్ సారే కావాలి.. మళ్లీ కారే రావాలి.. కేసీఆర్ సారే రావాలి’ అని రాసి ఉన్న ఫ్లెక్సీల వద్ద కేక్‌కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. దేశంలో మొదటి సారిగా బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చిన కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన మహిళా రైతులు, వ్యవసాయ కూలీలు స్థానిక బీఆర్ఎస్ నేతలతో ఓ మిర్చితోటలో వేడుకలు నిర్వహించారు. కథలాపూర్ మండలకేంద్రంలో వరదకాలువ నీటితో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
కోల్‌సిటీ, ఫిబ్రవరి 17 : కాంగ్రెస్ మోసపూరిత పాలన వల్ల మళ్లీ తెలంగాణ ప్రమాదం అంచున పడుతుందని, కేసీఆర్ మళ్లీ సీఎంగా వస్తేనే రాష్ట్రం క్షేమంగా ఉంటుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభిప్రాయపడ్డారు. ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలని, రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలని ఆకాంక్షించారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గోదావరిఖనిలోని శ్రీ జయదుర్గాదేవి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి ఆయన ఆయుష్ హోమం నిర్వహించారు. రామానంద భారతి మహాస్వామి, శ్రీరాంభట్ల శివ శర్మ సమక్షంలో 25 మంది రుత్వికులు హోమం జరిపించారు. రాష్ర్టాన్ని సాధించి దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దిన గొప్ప సాధకుడు అని కొనియాడారు. శక్తి స్వరూపిణి దుర్గామాత ఆశీస్సులు కేసీఆర్‌పై ఉండాలని కోరారు.
కోరుట్ల/మెట్పల్లి, ఫిబ్రవరి 17: తెలంగాణ ప్రజల కలను సాకారం చేసేందుకు ప్రాణాన్ని పణంగా పెట్టిన తెలంగాణ బాపు కేసీఆర్ సల్లంగా ఉండాలని, నిండు నూరేండ్లు వర్ధిల్లాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఆకాంక్షించారు. సబ్బండ వర్గాలు మళ్లీ కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచి పెట్టారు. అనంతరం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించగా, సంజయ్ సహా 50 మంది కార్యకర్తలు రక్తదానం చేశారు. మెట్పల్లి పట్టణంలోని ఆరపేట శివారులోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆవరణలో మొక్క నాటారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే గర్వకారణంగా నిలిపారన్నారు.
కేసీఆర్ నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో సల్లంగుండాలి. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఆయన అవసరం ఎంతగానో ఉన్నది. బీఆర్ఎస్ హయాంలో ఆయన అనేక సంక్షేమ పథకాలను తెచ్చి ప్రజలకు మేలు చేశారు. మళ్లీ ప్రజా సంక్షేమం కోసం ఆయన వస్తారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం మేం ఎప్పుడూ ముందుంటాం. అన్ని వేళలా అండగా నిలుస్తాం.
మంథని/మంథని రూరల్, ఫిబ్రవరి 17: రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌దేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ కొనియాడారు. ప్రజల గుండెల్లో నిలిచిన కేసీఆర్ సారథ్యంలో తాము పని చేయడం గర్వంగా ఉందని ఉద్ఘాటించారు. ఆయన కన్న కలలు మధ్యలోనే ఆగిపోవడంతో యావత్ రాష్ట్ర ప్రజలు బాధతో ఉన్నారని, మళ్లీ కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా సోమవారం మంథనిలోని ముక్తి ఆశ్రమం ఆవరణలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మొక నాటారు. కేక్ కట్ చేశారు. కేసీఆర్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. మంథని మండలం ఉప్పట్లలోనూ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు మినీ వాటర్ ఫ్రిజ్‌ను పుట్ట మధూకర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలతో పేదలకు భరోసాగా నిలిచారని, సాగు, తాగునీరు అందించడంతోపాటు హరితహారంతో రాష్ర్టాన్ని ఆకుపచ్చగా మార్చారని కొనియాడారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని నియోజకవర్గ ప్రజల పక్షాన కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఎగోలపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, మాచీడి రాజుగౌడ్, ఆరెపల్లి కుమార్, గొబ్బూరి వంశీ, వెల్పుల గట్టయ్య, ఆకుల రాజుబాబు, పెగడ శ్రీనివాస్, కనవేన శ్రీనివాస్, ఇర్ఫాన్ ఉన్నారు.
గోదావరిఖని/ ఫర్టిలైజర్‌సిటీ/ జ్యోతినగర్, ఫిబ్రవరి 17: స్వరాష్ట్రం సాధన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి, ప్రజల అరవై ఏండ్ల కల అయిన తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్ అని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ కీర్తించారు. కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా సోమవారం రామగుండం నియోజకవర్గంలో ఆయన పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. గోదావరిఖని ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మెడికల్ కళాశాలలో 71మంది రక్తదాతలతో రక్తదాన శిబిరం నిర్వహించి, 71 మొక్కలను పంపిణీ చేసి, 71మంది సింగరేణి రిటైర్డు ఉద్యోగులను సన్మానించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. ఈశ్వర కృపా ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం, జయదుర్గ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడారు. ప్రజల అభిమానాన్ని పొందిన కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు మూల విజయారెడ్డి, బాదె అంజలి, పెంట రాజేశ్, పాముకుంట్ల భాస్కర్, పీటీ స్వామి, గోపు ఐలయ్య యాదవ్, నడిపెల్లి మురళీధర్‌రావు, అచ్చె వేణు, రవీందర్‌రెడ్డి, మెతుకు దేవరాజ్, సట్టు శ్రీనివాస్, రాకం వేణు, ఇరుగురాళ్ల శ్రావణ్, బండారి ప్రవీణ్, రామకృష్ణ, రాములు, మహేందర్, వెంకటేశ్ ఉన్నారు.
పెద్దపల్లి, ఫిబ్రవరి17: తెలంగాణ తొలి సీఎం నిండు నూరేళ్లు జీవించాలని, ఆయన ఆదర్శవంతమైన పాలన మళ్లీ రావాలని, మరోసారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా పెద్దపల్లి బీఆర్ఎస్ కార్యాలయంలో వృక్షార్చన, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ సమైక్య పాలనలో వెనుకబడ్డ తెలంగాణను ముఖ్యమంత్రిగా అన్ని రంగాల్లో తీర్చిదిద్ది దేశానికే రోల్ మాడల్‌గా నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఛీ కొడుతున్నారని, మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. కాగా, రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో నాయకులు బ్లెడ్ డొనేట్ చేశారు.
రామడుగు, ఫిబ్రవరి17 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సోమవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, రామడుగు సింగిల్‌విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు ఎర్రవెల్లిలో కలిశారు. ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.