Karimnagar | మానకొండూర్, జూన్ 3: ఇసుక లారీలు, ట్రాక్టర్ల తో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని అక్రమ ఇసుక రవాణా ను అధికారులు అరికట్టాలని బీఅర్ఎస్ శ్రేణులు ఆరోపించారు. మండల కేంద్రంలోని పల్లెమీద చౌరస్తా వద్ద కరీంనగర్ వరంగల్ రహదారిపై నాయకులు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ తాల్లపెళ్ళి శేఖర్ గౌడ్ మాట్లాడుతూ ఊటూరు ఇసుక క్వారీ నుంచి ఇసుకను తరలిస్తున్న లారీలడ్రైవర్లు మితిమీరిన వేగంతో లారీలను నడపడం తో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
క్వారీ నిర్వాహకులు క్వారీ ప్రాంతంలో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంతో లారీల డ్రైవర్లు లారీలను ఇష్టం వచ్చినట్లు రహదారుల పక్కనే పార్కింగ్ చేస్తున్నారని దీంతో వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మండలంలోని శ్రీనివాస్ నగర్, జగ్గయ్యపల్లి, లింగాపూర్, వెల్ది, వేగురుపల్లి తదితర ప్రాంతాల నుంచి ప్రతిరోజు ట్రాక్టర్ల ద్వారా అక్రమ ఇసుకను తరలిస్తున్నారని దీనికి తోడు ఊటూరు క్వారీ నుంచి వందల సంఖ్యలో ఇసుక లారీలు, టిప్పర్లు వెల్లుతున్నయన్నారు. ఇసుక వాహనాల ద్వారా వచ్చే దుమ్ము, ధూళితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి అన్నారు.
ఇసుక లారీలు, ట్రాక్టర్ల తో మానకొండూర్ ప్రజలు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారన్నారు. రహదారి పక్కనే ఉన్న గృహ యజమానులు ఇసుక లారీలు, టిప్పర్లు, నుండి వచ్చే దుమ్ము ధూళితో అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు మామూళ్ల మత్తును వీడి అక్రమ ఇసుక రవాణా పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మానకొండూర్ నుంచి ఇసుక తరలిస్తున్న లారీలను నిలిపివేయాలని కోరారు.
ఆందోళన వద్దకు పోలీసులు చేరుకుని సమస్య పరిష్కరించదానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో నాయకులు గుర్రం కిరణ్ గౌడ్, పిట్టల మధు, కొత్తకొండ నాగరాజు, గడ్డం సంపత్, బుర్ర సత్యనారాయణ, బోడ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.