Bheemeswara Temple | వేములవాడ, డిసెంబర్ 24 : సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో రాజన్న సన్నిధిలో మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వేములవాడకు తరలివస్తున్నారు. రాజన్న ఆలయం ముందు గల ప్రచార రథం వద్ద స్వామివారినీ దర్శించుకుని భీమేశ్వర ఆలయంలో కోడె ముక్కు చెల్లించుకునేందుకు కూడా తరలివస్తున్నారు. దీంతో భీమేశ్వర ఆలయం వద్ద భక్తుల రద్దీగా ఉండగా భక్తుల రద్దీని ఆసరాగా చేసుకున్న దళారులు భక్తుల నుండి అందున కాడికి దోచుకుంటున్నారు.
బుధవారం హనుమకొండకు చెందిన రంగారావు అనే భక్తుడు కుటుంబంతో వేములవాడకు వచ్చారు. అయితే భీమేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రాగా దళారులు దర్శనాలు తొందరగా చేయిస్తామని చెప్పి ఒక్కొక్కరి వద్ద రూ.3వందల వరకూ వసూలు చేశారు. దళారులను గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే వారిని పట్టుకోవడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. సదర అనుమానతున్ని పట్టుకొని విచారించగా వేములవాడ రాజన్న క్షేత్రంలో దాదాపు పది మంది వరకు ఇలాంటి దళారులు ఉన్నట్లుగా గుర్తించారు.
రద్దీ రోజుల్లో అమాయక భక్తులను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున నగదు దోపిడీకి పాల్పడుతున్నట్లుగా గుర్తించి పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. దర్శనాల పేరుతో భక్తుల వద్ద నగదు వసూళ్లకు పాల్పడుతూ అక్రమ దందాకు తెర లేపిన వారిపై పూర్తి విచారణ జరిపి సంబంధిత వ్యక్తుల ఛాయాచిత్రాలు సేకరించి రాజన్న, భీమేశ్వర ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసి భక్తులను అప్రమత్తం చేసే దిశగా రాజన్న ఆలయ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.
చట్టపరమైన చర్యల కోసం పోలీసులను కోరుతున్నాం : రమాదేవి, ఆలయ ఈవో వేములవాడ
వేములవాడ రాజన్న, భీమేశ్వర ఆలయ పరిసరాల్లో భక్తులను దర్శనాల పేరుతో మోసాల పాల్పడుతున్న వారిపై చట్టబలమైన చర్యలు తీసుకునేందుకు పోలీస్ శాఖను కోరుతున్నాం. పలుమార్లు ఆలయ భద్రత సిబ్బంది హెచ్చరించినప్పటికీ వారిలో మార్పు రానందున చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నాం. మోసాలకు పాల్పడే వారిని గుర్తించి వారి ఛాయాచిత్రాలను కూడా ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ కోరుతాం. ఎక్కడైనా దళారులను నమ్మవద్దని కూడా ప్రత్యేకంగా బోర్డులు కూడా ఏర్పాటు చేస్తాం.