Ramagundam | కోల్ సిటీ, ఆగస్టు 6 : తల్లి పాలే బిడ్డకు శ్రీరామ రక్ష అని రామగుండం నగర పాలక మేయర్ మహంకాళి స్వామి అన్నారు. నగర పాలక సంస్థ పరిధిలోని నాలుగో డివిజన్లో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీవో అలేఖ్య పటేల్ ఆధ్వర్యంలో 4,5,6,7 డివిజన్ల అంగన్వాడీ కేంద్రాల తల్లిపాల వారోత్సవాలను ఒకే వేదికపై నిర్వహించారు. చిన్నారులకు అక్షరభ్యాసం, అన్నప్రాసన, గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ముఖ్యతిథిగా హాజరైన మేయర్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు తల్లిపాలు అమృతంతో సమానమనీ, తొలి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలే ఇవ్వాలని అన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో లభ్యమయ్యే పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పిల్లల ఆరోగ్యం, భవిష్యత్ కోసం ప్రతీ కుటుంబం తల్లిపాల ప్రాముఖ్యతను గుర్తించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కంకణాల మౌనిక రాజు, వేగోళపు రమాదేవి శ్రీనివాస్, సత్యప్రసాద్, సూపర్వైజర్ జమున, ఇన్చార్జి అనిల్, అంగన్వాడీ సిబ్బంది మంజుల, శ్రీవాణి, రజిత, అరుణ, రాజలక్ష్మి, సరోజ, నర్మద, స్వరూప, ఆశ వర్కర్లు, అధిక సంఖ్యలో గర్భిణులు, బాలింతలు, మహిళలు పాల్గొన్నారు.