Godavarikhani | కోల్ సిటీ, ఆగస్టు 1 : అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి పాలు ఇవ్వడమే మొదటి సహజ టీకా అని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ మణికేశ్వర్ రెడ్డి అన్నారు. రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యతిథిగా హాజరై గర్భిణులు, బాలింతలకు తల్లిపాల విశిష్టతపై అవగాహన కల్పించారు. బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే లభించే ముర్రుపాలు శిశువుకు మొదటి సహజమైన టీకా అని పేర్కొన్నారు. బిడ్డ మెదడు ఎదుగుదలకు తోడ్పడుతాయనీ, రోగ నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక వికాసం, వ్యాధుల నివారణకు అత్యంత శ్రేష్టమన్నారు.
ముఖ్యంగా బిడ్డతో భావోద్వేగ బంధం బలపడుతుందన్నారు. అనంతరం గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. కాగా, వారం రోజుల పాటు తల్లిపాల ఆవశ్యకతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు క్లబ్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో జోన్ చైర్ పర్సన్ తానిపర్తి విజయలక్ష్మీ, అధ్యక్షురాలు బంక కళావతి, సెక్రెటరీ జయప్రద, కోశాధికారి ఉమారాణి, సభ్యులు గంగాధర్, గోవర్ధన్, ఆరోగ్య కేంద్రం ఇన్ఛార్జి పారిజాతం తదితరులు పాల్గొన్నారు.