Breast milk | కోల్ సిటీ, ఆగస్టు 2: అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు వెయ్యి రెట్ల బలంతో సమానమని లక్ష్మీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మణికేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320జీ, లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం రీజియన్ 9 జోన్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా శనివారం నగర పాలక సంస్థ పరిధిలోని లక్ష్మీపూర్ ఆరోగ్య కేంద్రంలో తల్లిపాల ప్రాముఖ్యతపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
వైద్యాధికారి మణికేశ్వర్ రెడ్డి ముఖ్యతిథిగా హాజరై తల్లిపాల ఆపశ్యకత గురించి వివరించారు. పుట్టిన బిడ్డలకు తల్లిపాలు పట్టించడం వల్ల త్వరగా రోగ నిరోధిక శక్తి పెరిగి బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఎదుగుతారని పేర్కొన్నారు. సహజంగా లభించే అన్ని రకాల ప్రొటీన్లు, విటమిన్లు తల్లి పాలలో ఉంటాయనీ, బాలింతలు అపోహలు వీడి బిడ్డలకు తల్లిపాలు పట్టించాలని సూచించారు. లయన్స్ క్లబ్ సభ్యులు అవగాహన వారోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
అనంతరం క్లబ్ సభ్యులు గర్భిణులకు, బాలింతలకు పాలు, పండ్లు, బ్రెడ్లు, గుడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఎల్లప్ప, సెక్రెటరీ సారయ్య, కోశాధికారి రాజేంద్రకుమార్, లయన్ సత్యనారాయణ, రంగమ్మ, మనీషా అగర్వాల్, పీహెచ్సీ సిస్టర్ పారిజాతం, ఐసీడీఎస్ సూపర్వైజర్ మమత తోపాటు తల్లులు పాల్గొన్నారు.