కొడిమ్యాల, జనవరి 18 : బుడిబుడి నడకలతో ఆ ఇంట సందడి చేసిన బాలుడు, బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో మంచానికే పరిమతమయ్యాడు. వెంటిలేటర్‌పై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇప్పటి వరకు చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి న ఆ తల్లిదండ్రులు, ఆర్థిక స్థోమత లేక ఇంటికి తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నారు. దాతలు సాయం అందించి తమ కొడుకు ప్రాణం కాపాడాలని వేడుకుంటున్నారు. బాబు తల్లిదండ్రుల కథనం ప్రకా రం.. కొడిమ్యాల మండలంలోని తుర్కకాశీనగర్ గ్రామానికి చెంది న షేక్ అశ్రప్, అనిఫాకు 17 నెలల బాబు అర్షద్ అలామ్ ఉన్నాడు.
ఈ నెల 4న గ్రామానికి వచ్చిన వైద్య సిబ్బంది.. ఆ బాబుకు టీకాను వేశారు. అదే రోజు సాయంత్రం బాబుకు తీవ్రమైన జ్వరం రావడంతోపాటు వాంతులు కావడంతో వెంటనే తల్లిదండ్రులు కరీంనగర్‌లోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడ మూడు రోజులపాటు వైద్యం అందించిన తగ్గకపోవడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ బాబుకు బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పిన వైద్యులు, 11 రోజులపాటు చికిత్స అందించారు. అప్పటికే తల్లిదండ్రులు 10 లక్షలు ఖర్చు చేశారు. తర్వాత చికిత్సకు డబ్బులు లేకపోవడంతో వైద్యులు వెంటిలేటర్ ఏర్పాటు చేసి బాబును ఈ నెల 16న ఇంటికి పంపించారు. పదిహేను రోజులకోసారి దవాఖానకు తీసుకురావాలని సూచించారు.
అయితే, వెంటిలేటర్‌కు రోజుకు 2 వేల వరకు ఖర్చవుతున్నదని, ఇప్పటికే అప్పులు చేసి చాలా ఖర్చు చేశామని, ఇల్లు గడవడమే కష్టమవుతున్నదని బాబు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నా రు. దాతలు ముందుకు వచ్చి తమ ఫోన్ నెంబర్ 9121882729 కు ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా సాయం అందించి తమ కొడుకును కాపాడాలని కోరుతున్నారు. టీకా వికటించడం వల్లే బాబుకు బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయిందని, వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయయై మండల ప్రాథమిక వైద్యురాలు పరమేశ్వరిని వివరణ కోరగా.. బాబుకు ఇంతకు ముందే అకోస్టిక్ న్యూరోమా వేస్టు ప్లేస్ రాబోవా అనే ఆనారోగ్య సమస్య ఉందని, ఇంజక్షన్ వేయడం అలా కాలేదన్నారు. ఇంజక్షన్ వేసే సమయంలో బాబు ఆరోగ్యం బాగానే ఉందని జ్వరం లేదని వివరించారు.