కరీంనగర్ కార్పొరేషన్/ కమాన్‌చౌరస్తా, జనవరి 30: రాబోయే రెండున్నరేండ్లలో మళ్లీ కేసీఆర్ సర్కారే వస్తుందని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌కు అల్గునూర్ గెలుపు ద్వారం కావాలని, ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కాల్వ మల్లేశంకు అన్ని వర్గాలు అండగా ఉండి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ బాకీ కార్డును ప్రజలు మర్చిపోలేదని చెప్పారు. అధికారంలోకి రావాలనే ఆకాంక్షతో మహిళలకు 2,500, ఆడబిడ్డల పెండ్లికి లక్ష రూపాయలతోపాటు తులం బంగారం ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి లేదని, మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
ఈ మేరకు శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని ఎనిమిదో డివిజన్ (అల్గునూర్) బీఆర్ఎస్ అభ్యర్థి కాల్వ మల్లేశం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అల్గునూర్‌లో చేసిన అభివృద్ధి ప్రజల కండ్ల ఎదుటే ఉందన్నారు. రాబోయే రోజుల్లో కరీంనగర్‌కు అల్గునూర్‌ను ముఖద్వారంగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందన్నారు.
బీజేపీ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి బండి సంజయ్ అల్గునూర్‌కు చేసిందేమీ లేదని విమర్శించారు. ఆనాడు గులాబీ జెండా ద్వారా ఎంపీగా గెలిచిన తనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరం కలిసి కేంద్రం నుంచి స్పార్ట్ సిటీ కోసం నిధులు తెచ్చినట్లు గుర్తుచేశారు. ఈ కాంగ్రెస్ పాలనలో అల్గునూర్‌లో చీకట్లు కమ్ముకున్నాయని, కేబుల్ బ్రిడ్జి మీద ఒక లైట్ వెలుడగం లేదన్నారు. 8వ డివిజన్ కార్పొరేటర్‌గా కాల్వ మల్లేశంను గెలిపిస్తే అల్గునూర్ నుంచి మానకొండూర్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నగరపాలక సంస్థలో కాంగ్రెస్, బీజేపీ చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల్లో ఉచిత బస్సు తప్ప ఒక హామీ నెరవేర్చలేక పోయారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మాణం చేసిన రోడ్లను కూడా శుభ్రం చేసే పరిస్థితి లేదని మండిపడ్డారు. అనంతరం రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, అల్గునూర్‌లో ఏనాడూ కనిపించని ఎమ్మెల్యే, ఆయన సతీమణి ఎన్నికల సమయంలో వచ్చి అమలుకానీ హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు దొంగ హామీలను నమ్మిమోసపోవద్దని సూచించారు. బీసీ బిడ్డ కాల్వ మల్లేశంకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఇక్కడి జనం చూస్తుంటే మరో సమ్మక్క జాతర ఇక్కడ జరిగినట్లే ఉన్నదన్నారు.
అనంతరం కాల్వ మల్లేశంతో కలిసి వెళ్లి కార్పొరేషన్లో నేమినేషన్ వేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నాయకులు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, రావుల రమేశ్, సల్ల మహేందర్, పొన్నం సునీత అనిల్, ల్యాగల వీరారెడ్డి, పాశం అశోక్ రెడ్డి, ఎలుక ఆంజనేయులు, సూరం మహేందర్‌రెడ్డి, తాట్ల తిరుపతి, ఆవుదుర్తి రాంకిషన్, కనకం కొమురయ్య, చిల్ల పరశురాములు, కార్యకర్తలు పాల్గొన్నారు.