Register atrocity case | కోల్ సిటీ , మే 17: దళిత జాతికి చెందిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను అభివృద్ధి పనులు, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించకుండా అవమానిస్తున్న పెద్దపల్లి, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆయన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య, సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణలకు కలెక్టర్లపై శనివారం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాల సందర్భంగా ఫ్లెక్సీలలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఫొటో లేకుండా ప్రొటోకాల్ ఉల్లంఘించి దళిత ఎంపీని అవమానించిన సంఘటనలో దేవాదాయ శాఖ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.
ఇందుకు స్పందించిన వారు వెంటనే ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణరావు, డీజీపీకి సిఫారసు చేసినట్లు తెలిపారు. పెద్దపల్లి ఎంపీకి జరిగిన అవమానం యావత్తు దళిత జాతికి అవమానంగా భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాలు గానీ, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంకు గానీ పెద్దపల్లి ఎంపీకి ఆహ్వానం ఇవ్వకుండా తరచుగా అవమానిస్తున్న పెద్దపల్లి కలెక్టర్ తోపాటు మంచిర్యాల జిల్లాలో సైతం ఇదే తరహాలో వ్యవహరిస్తున్న అక్కడి కలెక్టర్ పై కూడా కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
సరస్వతీ పుష్కరాల్లో ఎంపీకి జరిగిన అవమానానికి భూపాలపల్లి కలెక్టర్ తోపాటు దేవాదాయ శాఖ అధికారులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే వారిపై చర్యలు చేపట్టాలని కోరగా కమిషన్ సత్వరమే స్పందించడం పట్ల మధు హర్షం వ్యక్తం చేశారు.