Bon festival | చిగురుమామిడి, జూలై 18 : మండలంలోని ఇందుర్తి గ్రామంలోని ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శుక్రవారం బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థినిలు అమ్మవారి తొమ్మిది అవతారాలలో(బాల త్రిపుర సుందరి, గాయత్రీ దేవి, అన్నపూర్ణ దేవి, కాత్యాయని దేవి, లలితా దేవి, శ్రీ లక్ష్మీదేవి, సరస్వతి దేవి, మహిషాసుర మర్దిని దేవి, రాజరాజేశ్వరి దేవి) అవతారాలలో ఆడుతూ పాడుతూ విద్యార్థులను అలరించారు.
బోనాలు ఎత్తుకొని చేతిలో వేప కొమ్మలు పట్టుకుని పిల్లలు చేసిన నృత్యాలు అబ్బురపరిచాయి. అబ్బాయిలు పోతరాజుల వేషధారణలో ఆడుతూ పాడుతూ ఆకట్టుకున్నారు. కాళ్లకు గజ్జలు కట్టి చేతిలో వీరగోల పట్టుకొని డీజే పాటలకు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ అప్పాల సమ్మయ్య మాట్లాడుతూ బోనాలు తెలంగాణ రాష్ట్ర పండుగ అని ఈ పండుగను ప్రతీ సంవత్సరం ఆషాఢమాసంలో రాష్ట్రమంతటా ఘనంగా జరుపుకుంటారన్నారు.
అందులో భాగంగా పాఠశాలలో కూడా ప్రతీ సంవత్సరం లాగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పాడిపంట లు సమృద్ధిగా పండాలని, విద్యార్థులకు చక్కటి విజ్ఞానాన్ని అందించాలని అమ్మవారిని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కూన సంపత్, ఉపాధ్యాయులు మంజుల, సంధ్య, శైలజ, సమత, సన అఫ్రీన్, సుస్మిత, జరీనా బేగం, చాందిని మాలిక్, సావిత్రి మాలిక్, జ్యోతి ప్రవకులు, ఎలిజబెత్, టర్శీల, దీప్తి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.