వేములవాడ రూరల్, నవంబర్ 16 : కాంగ్రెస్‌కు ఓటేస్తే కాట్లేసిన్నట్టేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ సూచించారు. బుధవారం రాత్రి వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి, పోచెట్టిపల్లి గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఏ సర్వేలు చూసినా కారుకు, సారుకు అనుకూలంగా ఉన్నాయన్నారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందాయనీ, అందరూ మరోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను, వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ప్రతి నిత్యం తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే సీఎం కేసీఆర్ మనకు ఉండడం గర్వకారణమన్నారు. ఈ ప్రాంతంపై అవగాహన ఉన్న ముఖ్యమంత్రి మనకు ఉండాలని, అవగాహన లేనివారితో మనకు ముప్పుతప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ వస్తే ఎవరు ముఖ్యమంత్రి అయితారో వారికే తెలియదని, ఢిల్లీకి బానిసలుగా ఉన్నవారు కావాలా?, తెలంగాణకు బాసటగా ఉన్న వారు కావాలో ప్రజలు అలోచించి ఓటు వేయాలని కోరారు.
అనంతరం వినోద్‌కుమార్, చల్మెడ లక్ష్మీనర్సింహారావును గ్రామస్తులు ఘనంగా సన్మానించడంతోపాటు నాగలిని బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు గోస్కుల రవి, ఎంపీపీ బండ మల్లేశం, సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఏశ తిరుపతి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాల్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం హన్మాండ్లు, సర్పంచ్ పెండ్యాల తిరుపతి, కట్కం మల్లేశం, సుమన్, నాయకులు పిట్టల వెంకటేశ్, సోమినేని బాలు, అంజనీకుమార్, పెండ్యాల శంకర్, ఈర్యానాయక్, నారాయణ, రోమాల ప్రవీణ్, కమలాకర్, తిరుపతి, రేకబ్ పాల్గొన్నారు.