కరీంనగర్, మార్చి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైస్‌మిల్లర్ల అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా బోయినపల్లి నర్సింగరావు ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి పద మూడు మంది నామినేషన్లు దాఖలుచేయగా.. అందరూ తమ తమ నామినేషన్లను శుక్రవారం విత్ డ్రా చేసుకోవడంతో నర్సింగరావు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నర్సింగరావు గతంలో రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడంతోపాటు వివిధ హోదాల్లో కొనసాగారు. ఆయన సేవలను గుర్తించిన మిల్లర్లు.. అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవడానికి సహకరించారు. మంత్రి గంగుల కమలాకర్ నర్సింగరావుకు శుభాకాంక్షలు తెలుపడంతోపాటు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ, రైస్‌మిల్లర్ల అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.
ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని చెప్పారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్షుడితోపాటు ట్రెజరర్ గుర్రం ఆనంద్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ-2గా సుధాకర్‌రావు ఎన్నికైనట్లు రాష్ట్ర అధ్యక్షుడు ఒక ప్రకటనలో తెలిపారు.