Chada Venkat Reddy | చిగురుమామిడి, ఆగస్టు 8 : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ పెట్టుబడుదారులను ప్రోత్సహిస్తూ సామాన్య ప్రజలను పెనుబారం మోపుతుందని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. సీపీఐ ప్రచార జాతలో భాగంగా చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి, ఉల్లంపల్లి, కొండాపూర్, నవాబుపేట, సుందరగిరి గ్రామాల్లో ప్రచార జాతలో జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌తో కలిసి శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించి దేశ అభివృద్ధి ఉపాధి అవకాశాలు, ప్రజా సంక్షేమం సుపరిపాలన అందిస్తామని వాగ్ధానం చేసినప్పటికీ ఏ ఒక్కటి అమలు చేయడం లేదని అన్నారు. నిత్యాసరాల పెంపు, పెట్రోలు డీజిల్ వంటగ్యాస్ ధరల పెంపుతో సామాన్యాలకు భారంగా మారిందన్నారు. రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొస్తే దేశ వ్యాప్తంగా ఆందోళన నిర్వహించి కేంద్ర ప్రభుత్వం విధానాలను ఎండగడతామన్నారు.
రైతులకు కనీసం మద్దతు ధర చట్టం తెస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. పండించిన పంటలకు కనీసం మద్దతు చట్టబద్ధత కల్పించాలని, మహిళా రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలని, ధరల పెంపులను నియంత్రించాలని, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల చట్టాలను పరిరక్షించుకోవాలని స్వయంగా సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ సమాన పనికి సమాన వేతనం కార్మికులకు అందించడంలో కేంద్ర విఫలమైందన్నారు. రాబోయే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలను పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అందే స్వామి, పొన్నగంటి కేదారి, మండల జాత కోఆర్డినేటర్లు గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బోయిని అశోక్, జిల్లా కౌన్సిల్ సభ్యులు చాడ శ్రీధర్ రెడ్డి, అందె చిన్నస్వామి, తీరాల సత్యనారాయణ, ముద్రకోల రాజయ్య, మాఊరపు రాజు, బూడిద సదాశివ, పద్మ, అంజలి, రంజిత్, గ్రామ కార్యదర్శులు అందే సంపత్, ఎండి ఉస్మాన్ పాష, రామస్వామి, శ్రీనివాస్ రాజు, అంజయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.