చిగురుమామిడి : కరీంనగర్, నిజామాబాద్, మెదక్, అదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం దగ్గర కాంగ్రెస్, బీజేపీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నెంబర్ ప్లేట్ లేని వాహనంలో కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారని బీజేపీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ వాహనంలో తనిఖీ చేశారు.
అందులో మూడు నేమ్ ప్లేట్లు, ఎన్నికల సామాగ్రిని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి డబ్బులు దొరకకపోయినప్పటికీ నెంబర్ ప్లేట్స్ ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టడంపై దర్యాప్తు చేసి వాహనాన్ని సీజ్ చేస్తామని ఎస్ఐ రాజేష్ తెలిపారు. ఇదిలావుంటే తిమ్మాపూర్ సీఐ స్వామి కరీంనగర్ పార్లమెంటరీ బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి బోయినపల్లి ప్రవీణ్ రావుపై, బీజేపీ నాయకులపై దురుసుగా ప్రవర్తించారని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొన్నం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు పోలోజు సంతోష్ ఆరోపించారు. అయితే బీజేపీ నాయకులు కారును ధ్వంసం చేశారని, తనపట్ల అనుచితంగా ప్రవర్తించారని మాజీ జడ్పీటీసీ గీకురు రవీందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.