కరీంనగర్, జూన్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) కరీంనగర్ (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతాపార్టీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. లోక్‌సభ నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజార్టీ సాధించిన ఎంపీగా ఆయన నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు, బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 17,97,150 మంది ఓటర్లు ఉండగా, అందులో 13,03,690 మంది గత నెల 13న తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంగళవారం నగరంలోని ఎ స్సారార్ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. బీజేపీ అభ్యర్థి పోస్టల్ ఓట్లు కలుపుకొని 5,85,116 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు 3,59,907 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ 2,82,163 ఓట్లు పొందారు. నిజానికి 2006 లోక్‌సభ ఉప ఎన్నికల్లో కేసీఆర్ 2,01,581 ఓట్ల మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు. 2014 ఎన్నికల్లో బోయినపల్లి వినోద్‌కుమార్ 2,05,007 ఓట్ల మెజార్టీతో గెలిచి, కేసీఆర్ కన్నా ఎక్కువ మోజార్టీ సాధించారు. ప్రస్తుతం బండి వీరి ఇద్దరికన్నా ఎక్కువ 2,25,209 ఓట్ల మెజార్టీ సాధించిన ఎంపీగా నిలిచారు. సాయంత్రం సం జయ్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఎన్నికల అధికారి పమేలా సత్పతి నుంచి గెలుపు ధ్రువీకరణ పత్రం అందుకున్నారు.
కనిపించిన మోడీ ప్రభావం
అందరూ అనుకున్నట్టుగానే ఉత్తర తెలంగాణపై మోడీ ప్రభావం ఈ ఎన్నికల్లోనూ స్పష్టంగా కనిపించింది. అందులోనూ కరీంనగర్లో మరింత ప్రస్పుటమైంది. మోడీ వేవ్ ఉందన్న అభిప్రాయాల నేపథ్యంలో దీనిని అందిపుచ్చుకోవడానికి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తనదైన శైలిలో పావులు కదిపారు. అందులో భాగంగానే దేశానికి మోడీ అవసరమని, మీరు వేసే ప్రతి ఓటు మోడీకే వెళ్తుందంటూ ప్రచారం చేశారు. ఒక దశలో ‘నా కోసం ఓటు వేయకండి.. మోడీ కోసం ఓటు వేయండి’ అంటూ తన ప్రచారంలో పిలుపు నిచ్చారు. దీంతో పాటు అయోధ్య రామమందిర నిర్మాణం, ప్రారంభం వంటి అంశాలతోపాటు అక్షింతల పంపిణీ వంటి సెంటిమెంట్ అంశాలను తనకు అనువుగా మలుచు కోవడంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటు ఇతర పార్టీ అభ్యర్థుల కన్న ముందుగానే.. యాత్ర చేయడం.. ఆ యాత్రలో చేసిన సెంటిమెంట్ వ్యాఖ్యలు బండి సంజయ్‌కి కలిసి వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే 2019 లోక్‌సభ ఎన్నికల్లో 89,508 ఓట్ల మెజార్టీ సాధించిన బండి.. ఈసారి ఏకంగా 2,25,209 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బండి విజయంతో బీజేపీ నాయకులు సంబురాలు చేసుకుంటున్నారు.
ఇది ప్రజల విజయం
నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీ అధికారంలోకి రావాలి. కానీ, కాంగ్రెస్ ఆరు హామీలు ఇచ్చి గద్దెనెక్కింది. అయితే అవి అమలు చేయడంలో విఫలమైంది. ఆరు గ్యారెంటీల అమలు కోసం నేను ప్రజల పక్షాన పోరాటం చేస్త. అప్పుడు కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయిన ప్రజలు, ఇప్పుడు కాంగ్రెస్‌ను ప్రశ్నించేందుకే నన్ను గెలిపించిన్రని భావిస్తున్న. ఇది ప్రజల గెలుపే. నాపై విశ్వాసం ఉంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించిన ప్రజలు, శ్రమించిన కార్యకర్తలకు నా విజయాన్ని అంకితం చేస్తున్న. ముచ్చటగా మూడోసారి మోడీ ప్రధాని అవుతున్నరు. గతంలో కన్నా ఎక్కువ కష్టపడి, నియోజవర్గానికి అధిక నిధులు తెచ్చి అభివృద్ధి చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్త. ప్రజలు మోడీ పాలనను విశ్వసిస్తున్నారని చెప్పడానికి మూడోసారి అధికారం ఇవ్వడమే నిదర్శనం. లోక్‌సభ నియోజకర్గం పరిధిలో నేను అందించిన సేవలు, బీజేపీ అధ్యక్షుడిగా నేను చేసిన పోరాటాలు, పేదల పక్షాన నిలిచిన విషయాలను గుర్తించిన ప్రజలు.. ఈభారీ మెజార్టీ ఇచ్చి గెలిపించిన్రు. ఈ గెలుపుతో నాపై మరింత బాధ్యత పెరిగింది.
– గెలిచిన అనంతరం ఎస్సారార్ కళాశాల వద్ద మీడియాతో బండి సంజయ్