గంగాధర, నవంబర్ 25: రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌పై విమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు పేర్కొన్నారు. గంగాధరలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నారాయణపూర్ రిజర్వాయర్, గంగాధర ఎల్లమ్మ చెరువు కట్టకు మరమ్మతులు చేసి యాసంగికి పంటలకు సాగు నీరు ఇవ్వాలని, ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలన్న సంకల్పంతో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పని చేస్తున్నారని పేర్కొన్నారు.
నియోజకవర్గంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధితో తాము ప్రజల్లో కనుమరుగు అవుతామన్న భయంతో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అసత్యపు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా పని చేసిన బొడిగ శోభ తమ సమస్యలను పరిష్కరించాలని ముంపు గ్రామాల ప్రజలు కోరితే వినతిపత్రాలను విసిరికొట్టిన విషయం ప్రజలు మరచిపోరన్నారు. బీజేపీ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలన్నారు.
పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని, ప్రభుత్వం రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేకుండా బీజేపీ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్లంపల్లి పైపులైన్ పనులను నాసిరకంగా వేసి నిర్లక్ష్యంగా వదిలేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, అధికారంలో ఉన్న సమయంలో ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు అభివృద్ధిపై విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే రవిశంకర్‌పై విమర్శలు చేస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ లోకిని ఎల్లయ్య, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్‌గోపాల్‌రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, ఆత్మ చైర్మన్ తూం మల్లారెడ్డి, సర్పంచులు వేముల దామోదర్, జోగు లక్ష్మీరాజం, ఎంపీటీసీ ద్యావ మధుసూదన్‌రెడ్డి, నాయకులు ఆకుల మధుసూదన్, రేండ్ల శ్రీనివాస్, వేముల అంజి, రామిడి సురేందర్, ముద్దం నగేశ్, సముద్రాల అజయ్, మ్యాక వినోద్, మొండయ్య తదితరులు పాల్గొన్నారు.