జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పార్టీని వీడడంపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. తల్లిపాలు తాగి రొమ్మునే గుద్దినట్టు.. ఇన్నేళ్లు పదవులన్నీ అనుభవించి ఇప్పుడు స్వార్థం కోసం పార్టీ మారాడంటూ గులాబీదళం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యమంలో లేకున్నా అధినేత కేసీఆర్ గొప్ప మనసుతో టికెట్ ఇస్తే.. అవకాశవాదంతో జంప్ అయ్యాడని ధ్వజమెత్తింది.
ఈ మేరకు సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలిపింది. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు జిల్లాకేంద్రాలతోపాటు మండల కేంద్రాల్లో సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేసి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగిత్యాలలోని ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించడంతో పాటు ఆయన దవాఖాన ఎదుట ఆందోళన చేశారు. ‘చెట్టు మీది కొంగ.. సంజయ్‌కుమార్ దొంగ’, ‘ఎమ్మెల్యే సంజయ్ రాజీనామా చేయాలి’ అని ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.
కరీంనగర్ కార్పొరేషన్/ జగిత్యాల, జూన్ 24 : జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరడంపై గులాబీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆయనకు వ్యతిరేకంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. మరోవైపు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జగిత్యాలలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశమై కార్యకర్తల్లో ైస్థెర్యం నింపారు.
అనంతరం స్థానిక తహసీల్ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే దిష్టి బొమ్మను తగలబెట్టారు. తర్వాత సంజయ్‌కుమార్ ఇంటిని, దవాఖానను ముట్టడించారు. మెట్‌పల్లిలోని పాత బస్టాండ్ వద్ద జగిత్యాల ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో జిల్లాలోని అన్ని మండలాల్లో ఎమ్మెల్యే దిష్టిబొమ్మలను దహనం చేసి, నిరసనలు తెలిపారు. అలాగే కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో నాయకులు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో బీఆర్ఎస్ నాయకులు, పోలీసుల మధ్య కొద్ది సేపు తోపులాట జరిగింది. అనంతరం బీఆర్ఎస్ నాయకులు సంజయ్‌కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరీంనగర్ జిల్లాలోని అన్ని మండలాల్లో సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు అన్ని మండలాల్లో ఎమ్మెల్యే సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేసి, నిరసనలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేసి, ఆయనకు వ్యతిరేకంగా నినదించారు. అనంతరం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంజయ్‌కుమార్‌కు మూడుసార్లు టికెట్ ఇప్పించారు. ఒక చంటి పిల్లాడిలా పట్టుకుని కాలికి బట్ట కట్టకుండా తిరిగి రెండుసార్లు గెలిపించారు. కానీ, అవేమీ ఆయనకు గుర్తుకురాలేదు. నమ్మక ద్రోహానికి ఒక ప్రతిరూపం ఎమ్మెల్యే సంజయ్ కుమార్. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలువడం బీఆర్ఎస్ భిక్ష. పార్టీ గుర్తుతో గెలిచి, మరో పార్టీలో చేరడం రాజ్యాంగ విరుద్ధం. ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతోపాటు సామాన్య ప్రజలు చెబుతున్నరు. తమ ఓటు వృథా అయిందని స్వచ్ఛందంగా వచ్చి తీవ్రంగా ఖండిచిన్రు.
– జగిత్యాలలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేశ్
ఉద్యమంలో పాల్గొనకున్నా సంజయ్‌కుమార్‌ను కేసీఆర్ పిలిచి మూడు సార్లు టికెట్ ఇచ్చిండు. కానీ, సంజయ్ తల్లి పాలు తాగి రొమ్ము మీద గుద్దిండు. ఆయన వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. ఆయన ఒకసారి ఓడినా మరో రెండు సార్లు గెలువడానికి ఎమ్మెల్సీ కవిత ఎంతో కృషి చేశారు. ఇప్పుడు సంజయ్ బీఆర్ఎస్కు నమ్మక ద్రోహం చేసిండు.
– జగిత్యాలలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
కష్ట కాలంలో ఉన్న పార్టీకి మోసం చేసి స్వార్థంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌ను జగిత్యాలలో తిరుగనివ్వం. అలాంటి వారు బతికున్నా చచ్చిన శవంతో సమానం. పార్టీలో ఆయనకు అత్యున్నత స్థానం ఇచ్చాం. నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులకు కేసీఆర్ నిధులు అందించారు. కానీ, వాటినన్నింటినీ తిరస్కరించి కాంగ్రెస్‌లో చేరడం విడ్డూరంగా ఉన్నది. డాక్టర్ సంజయ్ కుమార్‌కు టికెట్ ఇచ్చి గెలిపిస్తే స్వలాభం కోసం కాంగ్రెస్‌లో చేరడం సరికాదు. ఆత్మహత్యకన్నా హీనమైన చర్య. నీతి, నిజాయితీ, తెలంగాణ పౌరుషం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీలో నిలువాలి. కేవలం స్వార్థం కోసమే కాంగ్రెస్‌లో చేరారని, ప్రజల్లోకి వెళ్తే ఆయనకు నిరాశ తప్పదు.
– జగిత్యాలలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచిన సంజయ్‌కుమార్‌కు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలి. 2014, 2018, 2023లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచిండు. ఇన్నేళ్లు అన్ని రకాల పదవులు అనుభవించి కాంగ్రెస్‌లో చేరిండు. ఇలా చేయడం దురదృష్టకరం.
– జగిత్యాలలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్