రాజన్న సిరిసిల్ల, జనవరి 25(నమస్తే తెలంగాణ)/ కరీంనగర్ కలెక్టరేట్ 25 : ఓటర్ల నమోదు, ఓటరు అవగాహన, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణలో విశేష కృషి చేసినందుకు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్‌కు బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డులు దక్కాయి. 16వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా “మై ఇండి యా.. మై ఓట్” అనే థీమ్‌తో హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఆదివారం ఈ అవార్డులను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అందజేశారు.
కరీంనగర్ జిల్లాలో ఎన్నికల నిర్వహణలో వినూత్నంగా పలు కార్యక్రమాలు నిర్వహించి జిల్లా లో ఓటింగ్ శాతం పెంచడంతో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఎన్నికల అధికారులు, సహాయక అధికారులు, పోలింగ్ సిబ్బంది, పరిశీలకులకు శిక్షణ వంటి కార్యక్రమాలను కరీంనగర్ కలెక్టర్ సమర్ధవంతంగా నిర్వహించారు. ఎన్నికల నిబంధనలు, విధివిధానాలపై స్పష్టమైన అవగాహన కల్పించడం, సిబ్బంది నైపుణ్యాలు మెరుగుపర్చడం, పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టడంతో ఈ అవార్డుకు ఎంపికైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రజాస్వామ్యంపై ప్రజల్లో నమ్మకం పెంపొందించడంలో జిల్లా ఎన్నికల యంత్రాంగం విశేషంగా చేసిన కృషి వెనుక కలెక్టర్ ప్రోత్సాహం, సూచనలు ఉన్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా యంత్రాంగం సమష్టి కృషితోనే ఈ అవార్డు లభించిందన్నారు. అవార్డు పొందడంపై జిల్లా అధికారుల సంఘంతో పాటు పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. గరిమా అగ్రవాల్ గతంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో)గా పనిచేసిన సమయంలో చేసిన కృషికి గానూ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఉత్తమ సేవలు అందించి అవార్డు పొందిన ఇన్చార్జి కలెక్టర్‌కు జిల్లా అధికారులు, యంత్రాంగం శుభాకాంక్షలు తెలియజేశారు.
సిరిసిల్ల ఆర్డీవోకు అవార్డు
సిరిసిల్ల అర్డీవో సీహెచ్ వెంకటేశ్వర్లు సిరిసిల్ల నియోజకవర్గం ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌గా అందించిన సేవలకు గానూ ఆయనకు ఉత్తమ అవార్డు దక్కింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సీఈవో సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని చేతుల మీదుగా స్వీకరించారు.