Ration rice | కోల్ సిటీ, జూన్ 3: గోదావరిఖని జవహర్ నగర్ సమీపంలో గల రేషన్ దుకాణం గత మూడు రోజులుగా మూసే ఉంటోంది. ఈ దుకాణం ఎప్పుడూ ఇంతేనని స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది. మూడు రోజులుగా మూసే ఉండడంతో లబ్దిదారులు కాళ్లచెప్పులు అరిగేలా తిరగాల్సి వస్తుంది.
జూన్ 1 నుంచి మూడు నెలలకు సంబంధించి సన్నబియ్యం పంపిణీ చేయాలన్న ఆదేశాలతో గోదావరిఖనిలో అక్కడక్కడి ప్రాంతాలలో రేషన్ దుకాణాల ద్వారా లబ్దిదారులు సన్న బియ్యం పంపిణీ జరుగుతుంటే ఈ డివిజన్లోని రేషన్ దుకాణం మాత్రం మూడు రోజులైనా తెరుచుకోవడం లేదు. మంగళవారం నాటికి కూడా రేషన్ బియ్యం పంపిణీ చేయకపోవడంతో ఆ డివిజన్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతీ నెల ఇదే తంతు జరుగుతుందని ఎప్పుడు తీస్తారో… ఎప్పుడు పోస్తారో తెలియడం లేదని వాపోతున్నారు. కాగా, 32, 44వ డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు ఈ రేషన్ దుకాణం ద్వారా నెల నెల బియ్యం పంపిణీ జరిగేది.
ఐతే సదరు డీలర్ మరో డివిజన్ పరిధిలో రేషన్ దుకాణం తెరవడంతో ఇక్కడి డివిజన్ ప్రజలకు రేషన్ బియ్యం పంపిణీ సక్రమంగా జరగడం లేదని ఆరోపణలున్నాయి. మూడు రోజులుగా మూసే ఉంచడంతో లబ్దిదారులు ఉదయం, సాయంకాలం వచ్చి వట్టి చేతులతో వెనుదిరిగి వెళ్తున్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో బియ్యం పంపిణీ అస్తవ్యస్థంగా జరుగుతున్నట్లు లబ్దిదారులు ఆరోపిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాలలో సరిపడా బియ్యం రాలేదని డీలర్లు దాటవేస్తున్నట్లు తెలుస్తోంది. 32వ డివిజన్ జవహర్ నగర్లో మంగళవారం నాటికి రేషన్ దుకాణం తెరవకపోయినా పౌర సరఫరాల శాఖ అధికారులు ఏలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రేషన్ బియ్యంపైనే ఆధారపడే వృద్ధులు, ఒంటరి మహిళలు బియ్యం అందక తీవ్ర అవస్థలు పడుతున్నట్లు వాపోయారు.