జూలపల్లి, జనవరి 20 : స్వరాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల రూపురేఖాలు మారిపోతున్నాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతితో గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి దిశగా పయనిస్తున్నాయని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి నిరంతర ప్రక్రియగా భావించి ఆ దిశగా కృషి చేస్తున్నారని చెప్పారు. కుమ్మరికుంటలో దాదాపు రూ. 6 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు గురువారం మంత్రి ఈశ్వర్, ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్‌రావు, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్ కలిసి ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామస్తులు ఒగ్గుడోలు కళాకారుల విన్యాసాలు, డప్పు చప్పుళ్ల మధ్య ఘన స్వాగతం పలికి పూల మాలలు వేసి సత్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు భారీగా నిధులు కేటాయించి భారీ ప్రాజెక్టులు నిర్మించారని గుర్తు చేశారు.
కోటి 39 లక్షల ఎకరాలు సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. ఏడేండ్ల పాలనలో రాష్ట్రం నలుమూలలా అభివృద్ధ్ది విస్తరించిందని తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొప్పుల ‘ఎల్ఎం’ ట్రస్ట్ ద్వారా రూ.8 లక్షలతో నిర్మించిన గ్రామ ముఖ ద్వారం, రూ.20 లక్షలతో నిర్మించిన జీపీ భవనం, కుమ్మరికుంట పోచమ్మ చెరువు వద్ద రూ. 66 లక్షలతో నిర్మించిన వంతెన, కుమ్మరికుంట-బాలరాజ్పల్లి గ్రామాల మధ్య రూ.96 లక్షల తారురోడ్డు, కుమ్మరికుంట నుంచి ధర్మారం మండలం ఖిలావనపర్తి దాకా రూ.3 కోట్ల 54 లక్షల తారు రోడ్డు పనులు, నూతన యాదవ సంఘం భవనం, అంతర్గత సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. మున్నూరు కాపు సంఘం సామాజిక భవన నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు.
చీరలు, కుట్టుమిషన్లు పంపిణీ
‘ఎల్ఎం’ ట్రస్ట్ ద్వారా 150 మంది పేద మహిళలకు చీరలు, 15 మందికి కుట్టు మిషన్లు, యువకులకు క్రీడా సామగ్రి పంపిణీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 30 మంది మహిళలకు ఉపాధి కోసం కుట్టు శిక్షణ ఇప్పించి, ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున రుణాల మంజూరు పత్రం అందజేశారు. 12 మంది ఎస్సీలకు డప్పులు అందజేశారు. కాగా జిల్లాస్థాయి కేసీఆర్ క్రికెట్ కప్ పోటీల్లో గెలుపొందిన కుమ్మరికుంట, వెంకట్రావ్పల్లి జట్లకు నగదు బహుమతులు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ఇక్కడ జడ్పీ వైస్ చైర్మన్ మండిగ రేణుక, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, జడ్పీటీసీ సభ్యుడు బొద్దుల లక్ష్మణ్, వైస్ ఎంపీపీ మొగురం రమేశ్, సర్పంచ్ మేచినేని సంతోష్‌రావు, ఎంపీటీసీ సభ్యుడు తమ్మడవేని మల్లేశం, ఏఎంసీ చైర్మన్ కంది చొక్కారెడ్డి, మండల రైతు బంధు అధ్యక్షుడు విశారపు వెంకటేశం, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు శాతల్ల కాంతయ్య, పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కుంట రాజేశ్వర్‌రెడ్డి, ట్రస్ట్ చైర్మన్ కొప్పుల ప్రేమలత, తదితరులు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.