మెట్పల్ల్లి, జూలై 4: బీడీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. ఏఐటీయూసీ అనుబంధ విభాగమైన బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం వందలాది మహిళా కార్మికులు మెట్పల్లి సమీపంలోని సాంబాజీ బీడీ కంపెనీ ప్రధాన కార్యాలయం ఎదుట రోడ్డుపై ధర్నా చేశారు. నాసిరకం తునికాకు, తంబాకు ఇవ్వడం వల్ల చాటింగ్ పేరిట తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నదని, నెలకు కేవలం 9, 10 రోజులు మాత్రమే పని కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సాంబాజీ, రాజ్‌కమల్ బీడీ కంపెనీల యాజమాన్యాలు స్పందించి వెంటనే నాణ్యమైన తునికాకు, తంబాకును అందించాలని, నెలకు కనీసం 26 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు మాట్లాడుతూ, కార్మికుల సమస్యలను బీడీ కంపెనీలు గానీ, ప్రభుత్వాలు గానీ పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే పీఎఫ్ కటాఫ్‌తో సంబంధం లేకుండా అర్హులైన బీడీ కార్మికులందరికీ నెలకు 4 వేలు జీవనభృతి ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక సమస్యలపై దేశవ్యాప్తంగా ఈ నెల 9న జరగనున్న సమ్మెలో కార్మికులందరూ భాగస్వాము లై విజయవంతం చేయాలని కోరారు.