చిగురుమామిడి, జనవరి 28: వ్యాధులపై మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రేకొండ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ప్రత్యూష సూచించారు. రేకొండ, పెద్దమ్మపల్లి, బండారుపల్లిలో శుక్రవారం ఇంటింటా జ్వర సర్వే నిర్వహించారు. జ్వరం, జలుబు, తలనొప్పితో బాధపడుతున్నవారు పరీక్షలు చేయించుకుని వైద్య సిబ్బంది వద్ద మందులు తీసుకోవాలన్నారు. అర్హులైన వారందరూ కొవిడ్ టీకాలు వేసుకోవాలని కోరారు. శనివారం ఆరోగ్య కేంద్రం వద్ద శ్వాసకోస ఇబ్బందులను నివారించేందుకు గానూ ప్రాణాయామం, యోగాసనాలను చేయిస్తారని చెప్పారు. ఆసక్తిగలవారు మాసు ధరించి, భౌతికదూరం పాటిస్తూ ఆసనాలు వేయాలన్నారు. వైద్యులందించే ఆరోగ్య సూత్రాలను విధిగా పాటించాలని తెలిపారు. ఇక్కడ ఏఎన్ఎం శైలజ, ఆశ కార్యకర్త బండారు సరోజన ఉన్నారు.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్
లక్ష్మీపూర్ (వెల్ది) పీహెచ్సీ పరిధిలో డాక్టర్ బియాబానీ ఆధ్వర్యంలో శుక్రవారం 307 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చింది. లక్ష్మీపూర్, వెల్ది, ఊటూర్, వేగురుపల్లి, కెల్లేడు, జగ్గయ్యపల్లి గ్రామాల్లో 45 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. బూస్టర్ డోస్ వేసుకునే వారు నేరుగా పీహెచ్సీకి వచ్చి తీసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ఎండీ జుబేర్, ఎల్డీ కంప్యూటర్ ఆపరేటర్ ఎండీ ఇజాజ్, పీహెచ్ఎన్ మణెమ్మ, ఏఎన్ఎంలు సుజాత, స్వప్న, ఆశ వర్కర్లు తదితరులు ఉన్నారు.
ఇంటింటా జ్వర పీడితుల గుర్తింపు
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటా జ్వర పీడితుల గుర్తింపు సర్వే శుక్రవారం హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలో ఉద్యమంలాగా కొనసాగింది. బల్దియా పరిధిలోని 30 వార్డుల్లో మొత్తం 24 బృందాల సభ్యులు 789 ఇండ్లకు వెళ్లి 1034 మందికి ఫీవర్ పరీక్షలు చేశారు. 8 ఇళ్లలో జ్వర పీడితులను గుర్తించి పరీక్షలు చేసి 8 మందికి మెడికల్ కిట్లు అందజేశారు. 36 మందికి సెకండ్ డోస్,15 మందికి బూస్టర్ డోస్ టీకాలు వేసినట్లు హెచ్ఈవో వెంకటేశం, పీహెచ్ఎన్ హెల్త్ సూపర్వైజర్ నిర్మలాజ్యోతి తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, హెల్త్ అసిస్టెంట్లు ఏ పద్మ, వసంత, సౌందర్య, వజ్ర, వనిత, రేణుక, శోభ, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు.