మంథని, జూన్ 24 : కాంగ్రెస్ పార్టీది ప్రజా పాలన కాదని, ప్రజా వంచన పాలన అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, పార్టీ సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి తాటిపర్తి జీవన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. రెండున్నరేళ్ల పాలనలో విద్యార్థులు, రైతులు, మహిళలు ఇలా అన్ని వర్గాలకూ మోసమే జరిగిందని మండిపడ్డారు. ఆడబిడ్డలను మోసం చేసినోళ్లు పేరుకు రారని శాపనార్థాలు పెట్టారు. మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ విజయఢంకా మోగుతుందని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్వహించే సర్ కార్యక్రమంపై ప్రజలకు పూర్తిగా అవగాహన లేదని, శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మంథని పట్టణంలోని ఎస్ఎల్బీ గార్డెన్లో బుధవారం మాజీ ఎమ్మెల్యే, మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు, ‘సర్’పై బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, సభ్యత్వ నమోదు మంథని నియోజకవర్గ ఇన్చార్జి వీర్ల వెంకటేశ్వర్రావు, భూపాలపల్లి జడ్పీ మాజీ చైర్పర్సన్ జకు శ్రీహర్షిణి, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘవీర్సింగ్తో కలిసి జీవన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 వరకు సర్ కార్యక్రమం నడుస్తుందని, ఎన్యూమరేటర్ ఇంటింటికీ వస్తారని, గతంలో ఓటు ఉన్నప్పటికీ మళ్లీ ఫాం సమర్పిస్తేనే ఓటు నమోదు ప్రక్రియ ఆరంభమవుతుందన్నారు. ఫాం నింపివ్వకుంటే ఓటు తొలగించే అవకాశం ఉంటుందని, దీనిపై కార్యకర్తలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజల పక్షాన నిలబడితే రౌడీలు అని దుష్ప్రచారం చేస్తున్నారని ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయనోళ్లు అసమర్థులే కదా? అంటూ మండిపడ్డారు.
పుట్ట మధూకర్ మధ్య తరగతి కుటుంబంలో జన్మించి అనేక పదవులకు వన్నె తెచ్చాడని, ప్రస్తుతం దుద్దిళ్ల కుటుంబాన్ని ఎదురించగలిగే స్థాయి ఆయనకే ఉందన్నారు. అలాంటి నాయకుడికి కార్యకర్తలు, అభిమానులు అండగా నిలువాలని పిలుపునిచ్చారు. 2014కు ముందు రైతులు ఎలా దగా పడ్డారో మళ్లీ అదే పరిస్థితి నెలకొందన్నారు. రైతుబంధు రూ.15 వేలు ఇస్తామని మోసం చేశారని, తరుగు పేరిట ఎకరాకు రూ.6 వేల వరకు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా శ్రీధర్‌బాబు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
రైతులను మరోసారి దగా చేసేలా కేవలం ఏడు రకాల సన్నరకం వరినే పండించాలని, వాటికే బోనస్ ఇస్తామంటున్నారని, అయితే వీటికి ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడే వస్తుందని, దొడ్డు రకానికి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్నారు. ఫలితంగా రైతు ఎకరాకు పది క్వింటాళ్ల నష్టపోతారని చెప్పారు. ఎక్కడా లేని విధంగా యూరియా బస్తాల కోసం యాప్ పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతు బీమా ఎత్తివేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు.
మహిళలను కోటీశ్వరులు కాదు కనీసం లక్షాధికారులనైనా చేయాలని, 30 నెలలు గడుస్తున్నా ఏ ఆడబిడ్డకైనా సాయం చేశారా..? అని ప్రశ్నించారు. రాష్ట్రం లో హైడ్రాను తీసుకువచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి తనకు హిట్లర్ ఆదర్శమని చెప్పుకొచ్చాడని తెలిపారు. హిట్లర్‌కు పట్టిన గతే సీఎం రేవంత్‌రెడ్డికి పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పుట్ట శైలజ, మంథని నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన బీఆర్ఎస్ మండలాధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
వచ్చే ఐదేండ్లలో ప్రతి కార్యకర్తకూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అండగా నిలుస్తాం. ఎప్పుడూ డబ్బులే గెలువవు. అంబేదర్ ఇచ్చిన ఓటు ఆయుధం బలం. ముందుగా బీఎల్ఏ ద్వారానే నియోజకవర్గ ప్రజలకు అర్థం కావాలి. ఆ దిశగానే ప్రయత్నం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయకుండా హైడ్రా తీసుకు వచ్చి గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ వరకు భయబ్రాంతులకు గురిచేస్తున్నది. నియోజవకర్గంలో 35 నెలల కాలంలో శ్రీధర్‌బాబు చేసింది గుండు సున్నా. ఏడాదిలోగా చిన్న కాళేశ్వరం పూర్తి చేస్తానని చెప్పి ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదు. మాతా శిశు దవాఖాన నిర్మిస్తే అందులో డాక్టర్‌ను కూడా నియమించలేదు.
– పుట్ట మధూకర్, మంథని మాజీ ఎమ్మెల్యే
గతంలో బీఆర్ఎస్ నాయకులపై జరిగిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విఫలం కావడం వల్లే ప్రస్తుత పరిస్థితి ఏర్పడింది. కార్యకర్తలందరూ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు స్పందిస్తూ క్రియాశీలకంగా వ్యవహరించాలి. త్వరలోనే ఒక యాప్ ద్వారా డిజిటల్ పద్ధతిలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుంది. నియోజకవర్గాల్లో వీలైనంత వరకు మేమే స్వయంగా వచ్చి సభ్యత్వ నమోదును పర్యవేక్షిస్తాం. సందేహాలు, సలహాల కోసం త్వరలోనే ఒక వాట్సాప్ గ్రూప్‌ను అందుబాటులోకి తీసుకువస్తాం. గతంలో ఈ నియోజకవర్గంలో 50 వేల మంది సభ్యులు ఉండేవారు. ప్రస్తుతం సభ్యత్వం ద్వారా 75 కుటుంబాలకు 2 లక్షల చొప్పున బీమా అందించి పార్టీ పరంగా ఆదుకున్నాం. సాధారణంగా ఎకువ సభ్యత్వం ఉన్నచోట తకువ ఓట్లు వస్తుంటాయి. కానీ, ఇకడ 50 వేల సభ్యత్వానికి 72 వేల ఓట్లు రావడం విశేషం. బూత్ స్థాయి నుంచి గ్రామ, మండల స్థాయి వరకు బలమైన కేడర్‌ను నిర్మించుకోవడానికి ఇదొక మంచి వేదిక. ఈ సమయాన్ని వృథా చేయొద్దు.
-వీర్ల వెంకటేశ్వర్రావు, సభ్యత్వ నమోదు మంథని నియోజకవర్గ ఇన్చార్జి
ఇది విశ్రాంతి తీసుకునే సమయం కాదు. కష్టమైనా, ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగాలి. మంథని నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న వేధింపులతో భయానక వాతావరణం ఏర్పడుతున్నది. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? మేనిఫెస్టో చైర్మన్‌గా ఉన్న వ్యక్తి శ్రీధర్‌బాబు వీటికి సమాధానం చెప్పాలి. మంథని నియోజకవర్గంలో రెండున్నరేళ్లుగా ఎలాంటి కొత్త అభివృద్ధి పనులు జరగలేదు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజాదరణ పొందిన పుట్ట మధూకర్‌కు రూ.900 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆరోపిస్తూ బద్నాం చేశారు. రెండున్నరేళ్లవుతున్నా ఆ ఆస్తులను ఎందుకు బహిరంగ పర్చలేదో సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గురుకులాలు నాశనమవుతున్నాయి. ఇప్పటికే 107 మంది పిల్లలు చనిపోయారు. కొత్తగా తెస్తున్న ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా సూల్స్ కంటే మన పాత గురుకుల పాఠశాలలే దేశంలోనే అత్యుత్తమమైనవి. మంథని నియోజకవర్గంలో వడ్ల కొనుగోలులో క్వింటాల్‌కు 8 కిలోల చొప్పున కోత విధించడం వల్ల రైతులు భారీగా నష్టపోయారు. ఈ నష్టానికి ఎవరు సమాధానం చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను, అబద్ధాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపైనే ఉంది.
– కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి