Be careful..! కోల్ సిటీ, ఏప్రిల్ 13: కేకు కోసం బేకరీకి వెళ్తున్నారా..? అయితే బీ కేర్ ఫుల్ ఇంకా మిత్రులతో కలిసి ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ సెంటర్లకు వెళ్తున్నారా..? అక్కడ నోరూరించే పదార్థాలను తింటున్నారా..? అయితే మీ ఆరోగ్యానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం.. చెల్లించుకోవాల్సిందే. ఇటీవల రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఇటీవల కాలంగా గుట్టు చప్పుడు గాకుండా కాలం చెల్లిన, నాణ్యత లోపించిన ఆహార పదార్థాలను వినియోగదారులకు అంటగట్టి వ్యాపారులు మోసం చేస్తున్నారు. నగర పాలక సంస్థ అధికారులు అప్పుడప్పుడు జరిపిన తనిఖీల్లో ఖచ్చితంగా ఏదొక బేకరీ లేదా.. రెస్టారెంట్లో లో ఈ తరహా మోసాలు బయటపడటం ప్రజలను విస్మయానికి గురి చేస్తున్నాయి.
బయట పడ్డ రెండు సంఘటనలు
కాగా, కార్పొరేషన్ అధికారులు గోదావరిఖనిలో జరిపిన దాడుల్లో ఈ మధ్య కాలంలో రెండు సంఘటనలు వెలుగుచూశాయి. లక్ష్మీనగర్ లోని ఓ బేకరీ షాపులో కాలం చెల్లిన ముడి పదార్థాలతో కేకులు, స్వీట్లు తయారు చేస్తున్నట్లు నిర్ధారించారు. ఇక ఇంజిన్ అయిల్ ను పోలిన నల్లటి నూనెలో సమోసాలు, ఎగ్ బఫ్, కర్రీపఫ్ లు తయారు చేస్తున్నట్లు బయటపడింది. పాడైపోయిన కేకులు, సమోసాల నుంచి వాసన రాకుండా చల్లేందుకు కాలం చెల్లిన రసాయనాలను కూడా వాడుతున్నారు. మరుసటి రోజు మార్కండేయ కాలనీలోని ఓ రెస్టారెంట్లో తనిఖీ చేయగా, అక్కడ ఇదే తంతు బయటపడింది. ఈ రెండు షాపుల నిర్వాహకులకు అధికారులు జరిమానాలు విధించి చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి మోసాలు గోదావరిఖనిలోని మిగతా బేకరీలు, కర్రీ, బిర్యానీ పాయింట్లు, పాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లలో కూడా జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా పలు రెస్టారెంట్లలో రెండు, మూడు రోజుల పాటు నిల్వ ఉన్న కోడిమాంసంతో వివిధ రకాల పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఐతే రెండు మూడు నెలలకు ఒకసారి మాత్రం సాధారణ తనిఖీలు చేపట్టి ఏదో ఒక షాపుకు జరిమానా విధించి అధికారులు ఆపై చేతులు దులుపుకుంటున్నట్లు విమర్శలూ ఉన్నాయి.
పుట్టగొడుగుల్లా బిర్యానీ సెంటర్లు, బేకరీలు
గోదావరిఖని ప్రధాన చౌరస్తా నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఇటీవల కాలంగా పుట్టగొడుగుల్లా బిర్యానీ సెంటర్లు వెలిశాయి. కేవలం రూ.99కే బిర్యానీ అంటూ బోర్డులు పెట్టారు. వినియోగదారులను మరింత ఆకర్షించుకునే విధంగా బిర్యానీలో ఏమైనా ఫ్లేవర్ కోసం రసాయనాలు విలీనం చేస్తున్నారా..? లేదా అన్నది ఫుడ్ ఇన్స్పెక్టర్ పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మోసాలపై నిఘా ఉంచి బయటపెట్టాల్సిన బాధ్యత అటు టాస్క్ ఫోర్స్ విభాగంపై కూడా ఉంటుంది. కానీ రెండు శాఖల అధికారులు మాత్రం తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదన్న ఆరోపణలూ ఉన్నాయి. అందువల్లే నగరంలో ఇలాంటి బేకరీలు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, పచ్చళ్ల కేంద్రాలలో మోసాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. నెలనెల మామూళ్లు ఇచ్చే వ్యాపారుల జోలికి వెళ్లడం లేదన్న అపవాదు సైతం కార్పొరేషన్ కు ఉందని పలువురు బహిరంగంగానే విమర్శించుకుంటున్నారు. కార్పొరేషన్లోని పలు విభాగాల అధికారులు ఓ రాజకీయ నాయకుడి కనుసన్నల్లోనే నడుచుకుంటున్నట్లు ఆరోపణలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. దాంతో నగరంలో ఇలాంటి భారీ మోసాలకు పాల్పడుతున్న వ్యాపారుల జోలికి మాత్రం వెళ్లడం లేదని తెలుస్తోంది.
కార్పొరేషన్ పై ఆ లీడర్ పెత్తనం..
కాగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు రామగుండం కార్పొరేషన్ పై పెత్తనం చలాయిస్తున్నట్లు బయట ప్రచారం జరుగుతోంది. సదరు నాయకుడు చెప్పినట్టే నడుచుకోవాలంటూ కార్పొరేషన్ లోని పలు విభాగాల అధికారులు సైతం లోపల గుసగుసలాడుకుంటున్నట్లు సమాచారం.. వాచ్మెన్ నుంచి మొదలు కమిషనర్ వరకు సదరు నాయకుడి కనుసన్న లోనే పని చేస్తున్నారన్న ప్రచారం రామగుండంలో చర్చనీయాంశంగా మారింది.