పెద్దపల్లి, జనవరి 24(నమస్తే తెలంగాణ): దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. రూ.3016 ఆసరా పింఛన్‌తో పాటు బ్యాటరీ ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు వంటి ఉపకరణాలు అందజేస్తూ వారికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక చొరవ తీసుకుని రామగుండం నియోజకవర్గంలోని దివ్యాంగుల కోసం ప్రత్యేక చొరవ తీసుకుని భరోసా కల్పిస్తున్నారు. మంగళవారం వారికి పలు రకాల వాహనాలు, ఇతర వస్తువులను అందజేశారు. 72 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లు, ఏడుగురికి బ్యాటరీ వీల్ చైర్స్, నలుగురు బధిరులకు నాలుగు స్మార్ట్ ఫోన్స్, 25 మందికి కృత్రిమ కాళ్లు (క్యాలీ పర్స్), దివ్యాంగులు ఉపాధి పొందేందుకు రూ.12 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. అదే విధంగా విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల ఉచిత టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న 40 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందజేశారు. దీంతో రామగుండం నియోజకవర్గంలోని దివ్యాంగులు, మహిళల్లో ఆనందం వ్యకమవుతున్నది.
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు
విజయమ్మ చారిటబుల్ ట్రస్టు ద్వారా ఉచితంగా కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్నా. ఇప్పుడు నాకు పూర్తిగా కుట్టడం వచ్చింది. మా అందరికీ ట్రస్టు ద్వారా ఉచితంగా కుట్టు మిషన్ ఇచ్చిన్రు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సార్‌కు కృతజ్ఞతలు.
-ఉందతి అఖిల, సప్తగిరి కాలనీ (గోదావరిఖని)
బ్యూటీ పార్లర్ మంచిగా నడుపుకుంట
నేను బ్యూటీ పార్లర్ నడుపుకుంట జీవిస్తున్న. దివ్యాంగుల ఉపాధికి మరింత ప్రోత్సాహం ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన పేపర్ ప్రకటన చూసి దరఖాస్తు చేసుకున్న. నాకు రూ.50 వేల యూనిట్ మంజూరైంది. ఇది ప్రభుత్వం పూర్తిగా మాఫీతో ఇస్తున్న రుణం. ఈ డబ్బులతో బ్యూటీ పార్లర్‌ను మరింత మంచిగ నడుపుకుంట. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– తమ్మనవేని స్వప్న, పెద్దంపేట్, అంతర్గాం మండలం
ఇక నా పనులు నేనే చేసుకుంట
నేను వైకల్యంతో బాధ పడుతున్నా. మాలాంటి వాళ్ల కోసం ప్రభుత్వం బ్యాటరీ వీల్ చైర్స్, బ్యాటరీ వీల్ సైకిల్స్ అందించడం గొప్ప ఆలోచన. నేను ఈరోజు బ్యాటరీ వీల్ చైర్ తీసుకున్నా. ఇంట్లో అమ్మా, నాన్న అందుబాటులో ఉన్నా లేకున్నా వీల్ చైర్‌పై నా పనులు నేను చేసుకోగలుగుతా. వైకల్యంతో ఉన్నా గోదావరిఖని ఎగ్జిబిషన్లో ఒక స్టాల్ నిర్వహిస్తున్నా. ప్రతి రోజూ వెళ్లడం, రావడం చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ బ్యాటరీ వీల్‌చైర్‌తో నా బాధలు పోతయ్.
– నేరెళ్ల సౌమ్య, తిలక్‌నగర్ (గోదావరిఖని)
నా జీతంలో సగం ఆటో కిరాయికే అయ్యేది
నాకు పుట్టుకతోనే వైకల్యం ఉంది. చిన్నప్పటి నుంచి చాలా ఇబ్బందులు పడ్డా. పెరిగి పెద్దయ్యాక జీవనాధారం కోసం ప్రైవేటు పనిచేసుకుంటున్న. ఒక మొబైల్ షాపులో ఉద్యోగం చేస్తున్న. ప్రతి రోజూ షాపుకు వెళ్లాలన్నా.. ఇంటికి రావాలన్నా.. ఇంకెక్కడికైనా పోవాలన్నా ఆటోల్లోనే వెళ్లేది. ప్రతి నెలా నా జీతంలో సగం డబ్బులు ఈ ఆటోల కిరాయికే పోయేది. మంత్రి ఈశ్వరన్న, ఎమ్మెల్యే చందరన్న సహకారంతో ఇప్పుడు నాకు ఆ బాధలు తీరినయ్. ఈరోజు నాకు బ్యాటరీ సైకిల్ వచ్చింది. ఇక ఆటో కిరాయి ఖర్చు తప్పింది.
-సుందిళ్ల సతీశ్‌కుమార్, తిలక్‌నగర్ (గోదావరిఖని)
నా బాధ తప్పింది
మాది యైటిైంక్లెన్కాలనీలోని కుమారస్వామినగర్. నాకు నాలుగేళ్ల వయసులో పోలియో వచ్చింది. మా వాడలో ఒక షాపు పెట్టుకొని జీవిస్తున్న. ఎక్కడికి వెళ్లాలన్నా చానా ఇబ్బందయ్యేది. షాపులకు సామాను తెచ్చుకోడానికి తంటాలు పడేది. మేయర్ అనిల్‌కుమార్ సార్‌ను కలిసి చెప్పిన. ఎమ్మెల్యే చందర్‌తో మాట్లాడి నాకు బ్యాటరీ సైకిల్ ఇప్పించిండు. దీనికి ఆరు గంటల సేపు చార్జ్ చేశాక, స్పీడ్‌గా వెళ్తే 40 కిలో మీటర్లు, స్లోగా వెళ్తే 50 కిలో మీటర్లు వస్తుందట. ఇది నాకు, మా కుటుంబానికి చాలా ఉపయోగడుతది. చాలా సంతోషంగా ఉంది.
– బత్తినేని ఆదిలక్ష్మి, యైటిైంక్లెన్‌కాలనీ (గోదావరిఖని)