తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే అతి పెద్ద పండగ బతుకమ్మ. ఆడబిడ్డలు ఎంతో సంబురంగా జరుపుకునే ముచ్చట గొలిపే గొప్ప వేడుక. పూలనే దేవతగా పూజించే ప్రకృతి సంరంభానికి ప్రతి పల్లె ముస్తాబైంది. ఆడబిడ్డ సిద్ధమైంది. తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈ పూల సింగిడి శనివారం నుంచి మొదలు కానుండగా, పల్లెపల్లెనా కోలాహలం నెలకొన్నది.
-కమాన్చౌరస్తా, అక్టోబర్ 13
తెలంగాణలో బతుకమ్మ వచ్చిందంటే ఇంటిల్లిపాదికి సంబురం. ఆశ్వయుజ పాడ్యమికి ముందు వచ్చేది పితృ అమావాస్య. ఆ రోజును పెత్తరమాసగా జరుపుకుంటాం. అదే రోజు పేర్చే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. పూలను నోటితో ఊది వికసింప చేయడంతో వాటిని ఎంగిలిపూలు పేర్కొంటారు. పొలం గట్లలో ఉన్న పచ్చ తంగేడు, ఎర్ర తంగేడు, ముత్యాల పూలు, గునుగు పూలు, జిల్లేడు పూలు వంటివి సేకరించి బతుకమ్మను అందంగా పేరుస్తారు. మహిళలందరూ బతుకమ్మలను ఒకే చోట పెట్టి ఆడటం, వారి మధ్య బంధాలను బలపరుస్తుంది.
బతుకమ్మను తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు. ప్రతి రోజు బతుకమ్మలను ఆడి నిమజ్జనం చేసిన తర్వాత చెరువు గట్టున మహిళలు తమ వెంట తెచ్చుకున్న ఫలహారాలను పంచుకుని ఆరగిస్తారు. ఒక్కొ రోజు ఒక్కొ రకమైన ఫలహారాన్ని తయారు చేసుకొని వస్తారు. ఒక్కొ రోజు ఉపయోగించే ఫలహారాలకు బతుకమ్మల పేర్లు ఉంటాయి. మొదటి రోజు ఎంగిలిపూలతో బతుకమ్మ పెత్తర అమావాస్య రోజున పేరుస్తారు. చివరి రోజు (9వ రోజు) సద్దుల బతుమక్మ (పెద్ద బతుకమ్మ)తో ఆడుకుని, మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకుని వేడుకలను ముగిస్తారు..
తొలిరోజు: ఎంగిలిపూల బతుకమ్మ.. నువ్వు లు, నూకలు బెల్లాన్ని ప్రసాదంగా సమర్పిస్తారు.
రెండోరోజు: అటుకుల బతుకమ్మ.. చప్పిడి పప్పు, బెల్లం, అటుకుల ప్రసాదం నైవేద్యంగా పెడతారు.
మూడో రోజు: ముద్దపప్పు బతుకమ్మ.. ముద్దపప్పు, బెల్లం, పాలతో ప్రసాదం చేస్తారు.
నాలుగో రోజు: నానే బియ్యం.. పాలు, బెల్లం, నానేసిన బియ్యం పప్పుతో ప్రసాదం చేస్తారు.
ఐదో రోజు : అట్ల బతుకమ్మ.. నానబెట్టిన బియ్యాన్ని దంచి అట్లు, దోసలతో ప్రసాదం.
ఆరవ రోజు: అర్రెం.. బతుకమ్మ ఆడరు.
ఏడవ రోజు: వేపకాయ బతుకమ్మ.. సకినాల పిండితో ముద్దలు చేసి నూనేలో వేసిన వంటకాలు.
ఎనిమిదో రోజు: వెన్నముద్దల బతుకమ్మ.. నువ్వులు, వెన్న, బెల్లం, నేతి ప్రసాదం.
తొమ్మిదో రోజు: సద్దుల బతుకమ్మ.. చివరి రోజైన సద్దుల బతుకమ్మకు ఐదు రకాల సద్దులు.. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరి తురుము, నువ్వుల పొడిని ప్రసాదంగా సమర్పిస్తారు.