తెలంగాణ పరిపాలనా కేంద్రం, పార్టీల కార్యాలయాలు అన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నా రాష్ట్ర రాజకీయాలు మాత్రం కేసీఆర్ ఫామ్‌హౌస్ చుట్టే కేంద్రీకృతమై తిరుగుతున్నాయి. ఎర్రవల్లి కేంద్రంగా నడుస్తున్న కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ డ్రామాకు ఆ గ్రామ దళితులే తెరదించారు. ఓట్లకు ముందు అర్రాసు పాట పాడి, అరచేతిలో వైకుంఠం చూపి ప్రజల్ని బురిడీ కొట్టించిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనను, ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసింది. కేసీఆర్ మీద, ఆయన కుటుంబం మీద ప్రతీకారేచ్ఛతో రగులుతూ కాలం వెళ్లదీస్తున్నది. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయక్షేత్రంపై అసత్య ఆరోపణలు చేస్తున్న రేవంత్‌రెడ్డికి, స్థానిక ప్రజలు గట్టి సమాధానం ఇస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాను ఏ ఒక్కరోజు కూడా బాధ్యత కలిగిన వ్యక్తిగా వ్యవహరించడంలేదు. ముఠా నాయకునిగా, పాలోని పంచన చేరిన ఇంటోని తీరుగనే ప్రవరిస్తున్నారు. అసభ్యకరమైన బూతులతో దాడి చేస్తూ పదవీకాలంలో సగం కంటే ఎక్కువ పూర్తిచేసుకున్నారు. ఇంకా తనకు మిగిలిన సమయంలో కూడా ఏదో చేస్తారని ఎవరూ నమ్మడంలేదు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చుతూ రోజులు గడుపాలనే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తున్నది.
నిత్యం కేసీఆర్ వ్యతిరేకుల డైరెక్షన్లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ శాసనసభ్యుల ప్రశ్నలను ఎదుర్కొనే అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారు. రేవంత్ సినిమా ప్రజల్లో అట్టర్‌ప్లాప్ అయింది. దీంతో బీఆర్ఎస్ సభ్యులపై లేనిపోని ఆరోపణలు చేస్తూ, ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం వద్ద చావుడప్పు పేరుతో ప్రదర్శన నిర్వహించారు. ఆ షోనూ ప్రజలు ఛీకొట్టారు.
ఆ తర్వాత ఏం చేయాలో అంతుపట్టని రేవంత్‌రెడ్డి, దళితుల భూమిని కేసీఆర్ ఆక్రమించారనే అబద్ధాన్ని శాసనసభలో ప్రస్తావించి, ఆ తర్వా బోర్లాపడ్డారు. చింతమడకలో పుట్టిన కేసీఆర్ ఎర్రవల్లిలో తన వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడాన్ని అర్థం చేసుకోవాలంటే కొంత జ్ఞానం అవసరం. చరిత్ర, భూగోళం, జలశాస్త్రం తెలిసి ఉండాలి. ఎర్రవల్లి గ్రామం భౌగోళికంగా తెలంగాణకు గరిమనాభి. అంతేకాకుండా తెలంగాణలోనే అత్యంత ఎత్తయిన కాంటూన్ లెవల్లో ఉండే ప్రాంతం.
కేసీఆర్ రాకతో ఎర్రవల్లి తెలంగాణ పరిపాలనా కేంద్రంగా విలస్లిలింది. నల్లరేగడి, ఎర్ర నేలలతో మిళితమై ఉండే ఆ ప్రాంతంలో కేసీఆర్ భూమి కొన్నప్పుడు సరైన రోడ్డు, నీటి సదుపాయం లేవు. కానీ కేసీఆర్ హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న తన భూమిని అమ్మేసి, నగరానికి 60 కిలోమీటర్ల దూరంలోని ఎర్రవల్లిలో కొనుక్కున్నరు.
వ్యవసాయం మీద కేసీఆర్‌కు ఎంతో ఇష్టం, ప్రేమనో అందరికీ తెలిసిందే. ఎర్రవల్లిలో కేసీఆర్ ప్రత్యక్షంగా వ్యవసాయం చేస్తూ వినూత్న సాగు పద్ధతులను అవలంబిస్తున్నారు. పంటల సాగులో ప్రయోగాలు, అనుభవాలతో రైతుల సమస్యలకు పరిష్కారాలను చూపేందుకు కృషి చేస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని స్థిరీకరిస్తేనే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుందని విశ్వసించే కేసీఆర్, రైతును అత్యంత ప్రాధాన్యతగా పాలన అందించారు.
ఆకలి కేకల తెలంగాణను అన్నపూర్ణగా మార్చారు. రాష్ట్ర వనరులు, అవసరాల మీద విశేషమైన రాజకీయ అనుభవం, అవగాహన కలిగిన కేసీఆర్, మానవీయ పరిపాలనను అందించారు. కేసీఆర్ రాజకీయ ప్రయాణంలోని అనేక ఘటనలు అందించిన సంక్షేమ ఫలాలకు ప్రేరణగా నిలిచాయి. వ్యవసాయ క్షేత్రం వేదికగా తెలంగాణ ఉద్యమంలోని ఎన్నో మలుపులకు కేసీఆర్ వ్యూహరచన చేశారు. వచ్చిన తెలంగాణను ఎట్లా నిలబెట్టుకోవాలి, ఎట్లా అభివృద్ధి చేసుకోవాలో ప్రణాళికలు రచించారు.
గతుకుల రోడ్లకు చితికిన బతుకులకు నిలయమైన గజ్వేల్, కేసీఆర్ సారథ్యంలో అన్నింటా నంబర్‌వన్‌గా నిలిచింది. ళఎర్రవల్లి గ్రామ ప్రజల్లో ఒక కుటుంబంలా కలిసిపోయి జీవిస్తూ సమష్టి వ్యవసాయ ప్రయోగాల పట్ల అవగాహన కలిగిస్తున్నారు. సాంకేతిక సాగు పద్ధతులను ఆ గ్రామం మొత్తానికి అందించారు. అటువంటి కేసీఆర్ దళితుల భూమిని ఆక్రమించారంటూ రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలు.. ఎర్రవల్లి, గజ్వేల్ ప్రజలతోపాటు యావత్తు తెలంగాణ ప్రజలను ఎంతో బాధించాయి. అసత్య ప్రచారాన్ని రైతులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.
కేసీఆర్ తన ఫామ్‌హౌస్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎన్నో విధాలుగా వ్యక్తిగతంగా ఆపన్న హస్తం అందిం చారు. తన పొలంలో పనిచేయడానికి వచ్చిన వాళ్ల కషాలు తెలుసుకొని కూడా చేయూత ఇచ్చారు. అలాంటి మహోన్నత నేత వ్యక్తిత్వాన్ని కించపరిచి, ఆయన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తానని అనుకోవడం రేవంత్ మూర్ఖత్వానికి పరాకాష్ట. ఎవరెన్ని డైవర్షన్ పాటిలిక్స్ చేసినా, ప్రజల అటెన్షన్ మాత్రం కేసీఆర్ పట్లనే ఉన్నది. కాంగ్రెస్‌కు సబ్బండ వర్ణాలు ప్రజలు సరైన సమయంలో గుణపాఠం చెప్పి తీరుతారు.
-మాదాసు శ్రీనివాస్