తిమ్మాపూర్/ మల్లాపూర్, అక్టోబర్ 26 : పండుగ ఏదైనా బంతి పువ్వు ఉండాల్సిందే. డిమాండ్‌కు అనుగుణంగా వినూత్నంగా బంతి సాగును చేస్తూ లాభాలు గడిస్తున్నారు ఎంతో మంది రైతులు. తిమ్మాపూర్ మండలంలో ఏటా 20 ఎకరాల వరకు సాగు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఒక్కో ఎకరం బంతి సాగుకు 50వేల పెట్టుబడి వస్తుండగా.. పూల దిగుబడి, ధరను బట్టి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు లాభాలు వస్తున్నట్టు రైతులు చెబుతున్నారు.
ఒక్కో ఎకరంలో 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా.. ఇటీవలి బతుకమ్మ పండుగకు కిలో వంద చొప్పున విక్రయించగా లాభాలు గడించారు. మరోవైపు మల్లాపూర్ మండలకేంద్రంతో పాటు రాఘవాపూర్‌లో పలువురు రైతులు సేంద్రియ ఎరువులు వినియోగించి బంతి సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో దీపావళి పండుగ వస్తుండడంతో మరోసారి ‘బంతి’తోటలు సిరులు కురిపిస్తాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.