కరీంనగర్ : చందాలు వసూలు చేసేందుకే ఎంపీ బండి సంజయ్‌కుమార్ ( Bandi Sanjay) అమెరికా పర్యటన చేస్తున్నారని రాష్ట్ర సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ ( Sardar Ravinder Singh ) ఆరోపించారు. కరీంనగర్‌లోని తారక హోటల్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డబ్బులు వసూలు చేసేందుకే ప్రజాప్రతినిధుల మీద కేసులు ( Cases ), గ్రానైట్ వ్యాపారుల మీద ఫిర్యాదులు చేశారని విమర్శించారు.
ప్రజాప్రతినిధిపై వేసిన కేసులో హాజరు కాకపోవడంతో రాష్ట్ర హైకోర్టు ( High Court ) ఛీవాట్లు పెట్టి రూ.50 వేల జరిమాన విధించిందని వెల్లడించారు. కోర్టుల మీద నమ్మకం ఉందని, కోర్టు తీర్పులను గౌరవిస్తామని ప్రధాని మోదీ ( Narendra Modi ) ప్రకటిస్తే, ఆ పార్టీకే చెందిన ఎంపీ బండి సంజయ్ మాత్రం కోర్టుకు హాజరు కావాలని ఎన్నిసార్లు నోటీసులు పంపినా తప్పించుకొని తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. కోర్టులను గౌరవించని బండి సంజయ్‌కి ఎంపీ పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు.
నియోజకవర్గంలో అకాల వర్షంతో రైతులు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నష్ట పరిహారాన్ని అందించలేదని మండిపడ్డారు. మళ్లీ ఓట్ల కోసం ఎంపీ వస్తే మహిళలు, యువకులు, రైతులు బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. వ్యాపారులు, బడా సంస్థల నుంచి అక్రమంగా డబ్బులు కలెక్షన్లు చేసినందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి అతడిని తొలగించారని పేర్కొన్నారు .
కాంగ్రెస్ పార్టీ టికెట్ల ( Congress Tickets ) దరఖాస్తు పేరుతో డబ్బులను దండుకుంటుందని, ఆ పార్టీలో సభ్యత్వం లేని వారు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారని ఆరోపించారు. అభ్యర్థులు లేక దరఖాస్తుల పేరుతో అభ్యర్థులను వెతుక్కునే పరిస్థితికి కాంగ్రెస్ వచ్చిందన్నారు. ‘మేకిన్ ఇండియా’ అన్నప్పుడు మోదీకి భారత్ ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ ( CM KCR ) ముందు చూపుతోనే పార్టీ భారత రాష్ట్ర సమితిగా పేరు పెట్టడంతో మోదీ ఇప్పుడు భారత్ పేరు అంటున్నారని మండిపడ్డారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ ఘన విజయం సాధింస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, పెండ్యాల మహేశ్, కెమసారం తిరుపతి, మేకల చంద్రశేఖర్ యాదవ్, తివారీ, మజీద్, జయంత్ పాల్గొన్నారు.