Generate revenue | కోల్ సిటీ, జూన్ 17: గోదావరిఖని పట్టణంలో ఒక భారీ షాపింగ్ మాల్ నిర్మాణానికి సంబంధించి పర్మిషన్ ఇవ్వడంలో రామగుండం బల్దియా అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. షాపింగ్ మాల్ నిర్మాణానికి పర్మిషన్ ఇస్తే ఒకే మొత్తంగా రూ.60 లక్షల ఆదాయం రామగుండం నగరపాలక సంస్థకు సమకూరనుంది. అయినా అధికారులు ఎక్కడాలేని కొరివిలతో తీవ్ర కాలయాపన చేయడంలో ఆంతర్యం ఏమిటో? అర్థం కాని పరిస్థితి నెలకొంది.
ఏదైనా కట్టడానికి సంబంధించి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 21 రోజుల్లో అనుమతి లభించాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా కట్టడానికి సంబంధించి ఏదైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే ఆ అంశాలకు సంబంధించి తెలియజేయాల్సి ఉంటుంది. పర్మిషన్ విషయంలో చిన్న చిన్న అంశాలను తీవ్ర జాప్యం అనంతరం తెలియజేసి వాటిని సరిచేసిన తాము బిజీగా ఉన్నామని ఎల్ఆర్ఎస్ కారణంగా ఇతర పనులు చేయడం లేదని రెండు నెలలపాటు జాప్యం చేసిన పట్టణ ప్రణాళిక విభాగంఅధికారులు ఇప్పుడు రామగుండం నగరపాలక సంస్థలో వార్డుల విభజన జరుగుతుందని ఈ విషయంలో తాము బిజీగా ఉన్నామని పొంతనలేని విషయాలను చెబుతూ జాప్యం చేయడం అమ్యామ్యా ల కోసమేనా..? అనే ఆరోపణలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు బదిలీలు జరిగిన క్రమంలో మరింత ఆలస్యం చోటు చేసుకుంటుంది. అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రామగుండం నగరపాలక సంస్థకు ఏక మొత్తంలో పర్మిషన్ కు సంబంధించి రూ.60 లక్షలు ఒకేసారి వచ్చే అవకాశం ఉన్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఈ విషయంలో కలెక్టర్ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.