Namasthe thelangana effect | కోల్ సిటీ, జూన్ 23: రామగుండం నగర పాలక సంస్థ అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో పోదమ్మ మైదానంలో రాత్రికి రాత్రే వెలిసిన ఆక్రమ నిర్మాణాలపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలు..’ అనే శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఆ నిర్మాణాలకు కార్పొరేషన్ నుంచి ఏలాంటి అనుమతులు లేవని నగర పాలక కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ వివరణ కూడా ఇచ్చారు.
గోదావరిఖని లక్ష్మీనగర్ లో మొబైల్ దుకాణాలను నేలమట్టం చేయడం వల్ల అక్కడి వ్యాపారులు వీధిన పడ్డారు. వారికి ప్రత్యమ్నాయం చూపించలేదు. కానీ, నగరం నడిబొడ్డున ప్రధాన చౌరస్తాలో మాత్రం నిర్మాణాలు కొనసాగుతుండగా, వ్యాపారాలు కోల్పోయిన బాధితుల ఆవేదనను ఉటంకిస్తూ ‘అక్రమ నిర్మాణాలను అడ్డుకునేదెవరు..’ అంటూ ఈనెల 11వ తేదీన మరోసారి కథనం ప్రచురితమైంది.
ఈ వరుస కథనాలకు స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ స్పందించారు. గోదావరిఖని చౌరస్తాలో అనుమతులు లేకుండా వెలిసిన ఆశ్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు. దీనితో నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు సోమవారం సాయంత్రం చౌరస్తాకు చేరుకొని ఎక్స్కవేటర్ తో అక్కడి నిర్మాణాలను నేలమట్టం చేశారు. నగర పాలక సంస్థ అధికారులు స్పందించిన తీరును స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఈ అక్రమ నిర్మాణాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టుకోమంటేనే కట్టుకున్నామని పలువురు పేర్కొన్నారు.
కూల్చివేతలనంతరం బాధితులు లబోదిబోమన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబితేనే తాత్కాలికంగా నిర్మించుకున్నామని, గత నెల రోజులుగా నిర్మాణాలు చేపడుతున్న కార్పొరేషన్ అధికారులు ఎందుకు అడ్డు చెప్పలేదని, నిర్మాణాలు పూర్తయ్యాక ఇప్పుడు వచ్చి అనుమతులు లేవని కూల్చడం వల్ల తాము ఒక్కొక్కరం రూ.లక్ష వరకు నష్టపోయామని బాధితులు గోడు వెల్లుబోసుకున్నారు