కార్యకర్తలే బీఆర్ఎస్ బలం, బలగమని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై గ్రామాల్లో చర్చ పెట్టాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తా గడపగడపకూ వెళ్లి పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. కథలాపూర్ మండలకేంద్రంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, జిల్లా ఇన్చార్జి కోలేటి దామోదర్ గుప్తాతో కలిసి హాజరయ్యారు. ప్రత్యేక రాష్ట్రంతోనే అభివృద్ధి సాధ్యమమైందని చెబుతూ.. ‘నమస్తే తెలంగాణ’ రూపొందించిన ‘నాడు నేడు’ సంచిక అద్భుతంగా ఉందని కొనియాడారు. గ్రామాల్లో ప్రతిపక్షాల ఆరోపణలను ఎక్కడికక్కడ సరైన సమాధానాలతో తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు. – కథలాపూర్, ఏప్రిల్ 4
కథలాపూర్, ఏప్రిల్ 4 : బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో చర్చలు పెట్టాలని, ప్రతి కార్యకర్త గడపగడపకూ వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి పనులు, పథకాలను వివరించాలని, ప్రతిపక్షాల నాయకుల అసత్య ప్రచారాన్ని సరైన సమాధానాలతో తిప్పికొట్టాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. కార్యకర్తలే బీఆర్ఎస్ బలం, బలగమని స్పష్టం చేశారు. కథలాపూర్ మండలకేంద్రంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, జిల్లా ఇన్చార్జి కోలేటి దామోదర్ గుప్తాతో కలిసి వినోద్ కుమార్ హాజరయ్యారు. ముందుగా తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం కథలాపూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. పార్టీ కార్యకర్తలకు సీఎం సందేశాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ, 2001లో గులాబీ జెండా వచ్చిందని, ఈ సందర్భంగా అప్పుటి పరిస్థితులను గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రంతోనే అభివృద్ధి సాధ్యమమైందని చెబుతూ.. ‘నమస్తే తెలంగాణ’ రూపొందించిన ‘నాడు నేడు’ సంచిక అద్భుతంగా ఉందని కొనియాడారు. రాష్ట్రంలో పింఛన్లు 2016 ఇస్తుంటే, బీజేపీ పాలిత రాష్ర్టాలైన కర్ణాటకలో 600, మహారాష్ట్రలో 200లే ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతులు పండించిన ధాన్యం సంపూర్ణంగా కొనడం లేదని, కానీ, మన సర్కారు రైతు పండించిన ప్రతి గింజనూ మద్దతు ధరతో కొంటున్నదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని, కానీ, మన ప్రభుత్వం భవిష్యత్ తరాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిందని చెప్పారు. ఇంత ఎండలో సైతం కాకతీయ కాలువలో నిండుగా నీళ్లు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడక ముందు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగేవని, రోడ్లను విస్తరించి డబుల్ రోడ్లు వేయడంతో ప్రమాదాల సంఖ్య తగ్గిందన్నారు. అప్పట్లో చిన్నారులు అరటిపండ్ల బండ్లు, పంక్చర్ షాపుల్లో ఉండేవారని, మన ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి 1.20 లక్షలు ఖర్చు పెట్టి నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తున్నదన్నారు. మనిషి ఉన్నంత వరకు సమస్యలుంటాయని, వాటి పరిష్కారం కోసం కృషి చేసేదే బీఆర్ఎస్ అని, నేడు తెలంగాణ బిడ్డలమని గర్వంగా చెప్పుకునే రోజులు వచ్చాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి గురించి పార్లమెంట్లో బీజేపీ మంత్రులే గొప్పగా చేప్పే స్థాయిలో మనం ఉన్నామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి అప్పులు ఇవ్వడానికి బ్యాంకులే క్యూ కడుతున్నాయన్నారు. కథలాపూర్ మండల సమస్యల తీర్మానం కాపీని రెండు రోజుల్లో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, సమ్మేళనంలో పెద్దసంఖ్యలో వచ్చిన ప్రజలకు హాల్ సరిపోకపోవడంతో పక్కనే మరో హాల్లో ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. సమ్మేళనంలో ఎంపీపీ జవ్వాజి రేవతి, జడ్పీటీసీ నాగం భూమయ్య, జడ్పీ వైస్ చైర్మన్ వొద్దినేని హరిచరణ్‌రావు, నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ గుండారపు సౌజన్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గడీల గంగప్రసాద్, వైస్ ఎంపీపీ గండ్ర కిరణ్‌రావు, వైస్ చైర్మన్ సోమ దేవేందర్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఎంజీ రెడ్డి, ఎంపీటీసీల పోరం మండలాధ్యక్షుడు బొడ్డు బాలు, ఆర్బీఎస్ సభ్యుడు చీటి విద్యాసాగర్‌రావు, రైతు సంఘం మండలాధ్యక్షుడు గడ్డం భూమారెడ్డి, నాయకులు చుక్క దేవరాజం, దాసరి గంగాధర్, కల్లెడ శంకర్, గంగాధర్, జలేందర్, మహేందర్, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
సూరమ్మ చెరువును నింపితీరుతాం
కథలాపూర్ మండలం లోని వరదకాలువకు లిఫ్ట్ ఏర్పాటు చేస్తాం. కలికోట, సూరమ్మ చెరువులను నీటితో నింపి తీరుతాం. వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో చర్చించారు. కేసీఆర్ స్వయంగా కథలాపూర్, మేడిపల్లి నాయకులతో ఫోన్ మాట్లాడారు. తప్పని సరిగా త్వరలోనే సూరమ్మ చెరువును నింపి చూపిస్తాం. సూరమ్మ చెరువుపై ప్రతిపక్షాలు అనవసరపు రాజకీయం చేయద్దు. వరద కాలువలను సముద్రంలా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే.
– బోయినపల్లి వినోద్ కుమార్
దీటుగా సమాధానం చెప్పాలి
ఇది ఎన్నికల సంవత్సరం. బీజేపీ, కాంగ్రెస్‌కు దీటు గా సమాధానం చెప్పాలి. అందుకు కార్యకర్తలు సన్నద్ధం కావాలి. 2018 నుంచి ఇప్పటివరకు మన నియోజకవర్గంలో రైతుబంధు కింద 11,492 మంది రైతులకు 139 కోట్లు పంపిణీ చేశాం. రై తుబీమా ద్వారా 190 రైతు కుటుంబాలకు 5.18 కోట్లు ఇచ్చాం. 1300 మందికి కల్యాణలక్ష్మి ద్వారా 13 కోట్లు ఇచ్చాం. కంటి వెలుగు ద్వారా 15 వేల మందికి చికిత్స అందించాం. ఇప్పటివరకు 15దళిత బంధు యూనిట్లు ఇచ్చాం. నియోజకవర్గంలో 110 కోట్లతో 100 మందికి దళితబంధు యూనిట్లు పంపిణీ చేస్తాం. 4800 ఇండ్లు ఈ నెలలో మంజూరుచేస్తాం. తక్కళ్లపెల్లి బ్రిడ్జి పనులను త్వరలోనే పూర్తి చేస్తాం. నేను మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అత్యధిక మెజార్టీ కథలాపూర్ నుంచి వచ్చింది. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని, పథకాలను ప్రజలకు వివరించాలి.
– చెన్నమనేని రమేశ్‌బాబు, వేములవాడ ఎమ్మెల్యే
దేశంలోనే నంబర్ వన్
కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలమైంది. అభివృద్ధి, సంక్షేమంలో మన రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ నిలిచింది. అనేక అవార్డులు సొంతం చేసుకున్నది. అందుకే దేశం మొత్తం కేసీఆర్ వైపు చూస్తున్నది. విజయవంతంగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టి తీరుతం. ప్రతి గడపకూ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఎమ్మెల్యే 50 వేల మెజార్టీతో గెలువడం ఖాయం. గ్రామాల్లోని బీఆర్ఎస్ సైనికులు ఇంటింటికీ వెళ్లి అభివృద్ధి పథకాలను వివరించాలి. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి.
– కోలేటి దామోదర్ గుప్తా, బీఆర్ఎస్ జగిత్యాల ఇన్చార్జి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్
అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి
కరోనా రావడంతో కార్యకర్తలను కలువడంలో గ్యాప్ వచ్చింది. అందరినీ కలిసి చర్చించేందుకే ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నాం. 2014కు ముందు అభివృద్ధి ఎలా ఉన్నది? ఇప్పుడెలా ఉన్నది? అనేది ప్రజలు గుర్తించాలి. అందరి కష్టాలు తెలిసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్, తెలంగాణను ఎంతో నమ్మకంతో సంపూర్ణ అభివృద్ధి చేస్తున్నారు. దేశంలోని మరే రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో పథకాలు అమలు చేస్తున్నారు. అందుకే చుట్టుపక్కల రాష్ర్టాల ప్రజలు సైతం కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నారు. ప్రజలు ఆలోచించాలి. ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలి.
– కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే