కరీంనగర్ తెలంగాణచౌక్, డిసెంబర్ 3 : ‘మహాలక్ష్మీ స్కీంతో రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల బతుకు ఆగమైంది. కిరాయిలు లేక ఇప్పటివరకు 65 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వందలాది కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. లేదంటే బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి పెద్దపల్లి టూర్‌ను అడ్డుకుంటం’ అని తెలంగాణ యునైటెడ్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ వర్గానికి మేలు చేసిందని ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నదని మండిపడ్డారు. కరీం‘నగరం’లోని ప్రెస్ భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు మద్దె రాజేందర్‌తో కలిసి ఆయన మాట్లాడారు.
మహాలక్ష్మి స్కీంతో రాష్ట్ర వ్యాప్తంగా 7లక్షల 50వేల మంది ఆటో డ్రైవర్ల జీవితాలు ఆగమయ్యాయని, రోజువారీగా 200 కూడా లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని, ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12వేలు ఇస్తామని నమ్మించి మోసం చేసిందని మండిపడ్డారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కాంగ్రెస్ మేనిఫెస్టో చైర్మన్, మంత్రి శ్రీధర్‌బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బాధ్యత వహించాలని, ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ల కుటుంబాలకు 20లక్షలు ఎక్స్‌గ్రేషియా. వెయ్యి కోట్లతో ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు ఈ నెల 7న రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రాష్ట్రలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఆందోళన చేస్తామని చెప్పారు. ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.
కేసీఆర్ చెప్పినట్టు చెరువులు నింపండి
మేడిపల్లి, డిసెంబర్ 3 : రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టుగా ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా నీటిని ఎత్తిపోసి చెరువులు నింపాలని భీమారం మండలంలోని గోవిందారం, దేశాయిపేట, రాజలింగంపేట రైతులు డిమాండ్ చేశారు. సూరమ్మ చెరువు ప్రాజెక్ట్ కుడి కాలువ నిర్మాణం కోసం తమ భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. కథలాపూర్ మండలం సూరమ్మ చెరువు ప్రాజెక్ట్ కుడికాలువ నిర్మాణం కోసం గోవిందారం రెవెన్యూ పరిధిలో భూసేకరణకు వారం క్రితం ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వగా, మంగళవారం తహసీల్దార్ రవికిరణ్ గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు సంతకాలు చేయకుండా బహిష్కరించారు.
భూ సేకరణను నిలిపేసి, ప్రాథమిక నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, కుడికాలువ భూ సేకరణతో చిన్న, సన్నకారు రైతులకు జీవనాధారమైన భూములు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా వరదకాలువను నిండుగా మార్చి చెరువులను నింపుతామని మాజీ సర్పంచ్ కాటిపల్లి శ్రీపాల్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడారని, ఆ మేరకు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ సర్వే చేయించారని గుర్తు చేశారు. కుడి కాలువ భూసేకరణ నిలిపివేసి, కేసీఆర్ సర్కారు చేసిన సర్వే ప్రకారం చెరువులను నింపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు కరండ్ల మధుకర్, నాంచారి స్వప్న, రాజేందర్, మాజీ వైస్ ఎంపీపీ దొంతి శ్రీనివాస్, నాయకులు అన్నాడి జలపతిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.