కరీంనగర్ తెలంగాణచౌక్, డిసెంబర్ 7 : ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ ఆటో యూనియన్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం ఆటోల బంద్ విజయవంతమైంది. కరీంనగర్లో ఆటో డ్రైవర్లు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. బంద్ విఫలం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పన్నిందని తెలంగాణ ఆటో ట్రాన్స్‌పోర్టు యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు మద్దెల రాజేందర్ ఈ సందర్భంగా మండిపడ్డారు. ఆటో యూనియన్ నాయకులతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. జూలపల్లి మండలంలో 500 ఆటోలను డ్రైవర్లు ఎక్కడికక్కడ నిలిపి వేశారు. సుల్తానాబాద్‌లో 400 మంది ఆటో డ్రైవర్స్ యూనియన్ సభ్యులు ర్యాలీ తీసి, స్థానిక తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు.
రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద ఆటో కార్మికులందరూ ఆటోలను బంద్ చేసి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. గంభీరావుపేట మండలంలో ఆటో కార్మికులు బంద్ పాటించారు. స్థానిక తెలంగాణ అమర వీరుల స్తూపం వద్ద తమ ఆటోలతో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. తర్వాత పెద్దమ్మ స్టేజీ వద్దకు ర్యాలీగా తరలి వెళ్లి సిరిసిల్ల -కామారెడ్డి ప్రధాన రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. ఆటో యజమానులు, డైవర్లు రోడ్డుపై భోజనం చేస్తూ తమ నిరసన తెలిపా రు. కోనరావుపేటలో ఆటో కార్మికులు తహసీల్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అంద జేసి, ధర్నా నిర్వహించారు. ముస్తాబాద్‌లో బంద్ పాటించారు.