కార్పొరేషన్, డిసెంబర్ 19: మంచి నీటి సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్‌రావు ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం మంచి నీటి సరఫరా విభాగం ఇంజినీరింగ్ అధికారులు, కమిషనర్ బోనగిరి శ్రీనివాస్‌తో కలిసి ఆయన సమీక్షించారు. ప్రత్యేకంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్, ప్రస్తుతం నీటి సరఫరాలో తలెత్తే సమస్యలు, లీకేజీలు, వాల్స్ రిపేర్, ఇంటర్ కనెక్షన్స్‌పై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సమయానికి అనుగుణంగా ప్రతి రోజూ నీటిని సరఫరా చేయాలన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని సమ్మర్ యాక్షన్ ప్లాన్‌ను పూర్తి స్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విలీన గ్రామాల డివిజన్ల పరిధిలో మంచి నీటిపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాని ఆదేశించారు. ప్రధానంగా అంబేడర్ రిజర్వాయర్ పరిధి నీటి సరఫరాలో తరుచుగా సమస్యలు తలెత్తుతున్నాయని, ఎకడ సమస్య వస్తుందో పరిశీలన చేసి పరిషరించాలని సూచించారు. నీటి సరఫరా సమయంలో లైన్మెన్, సిబ్బంది ఫీల్డ్ లెవల్లో తిరుగుతూ పర్యవేక్షణ చేయాలన్నారు. లీకేజీలను అరికట్టాలన్నారు. ఫిల్టర్ కెపాసిటీ ప్రకారం మానేరు డ్యాం నుంచి రా వాటర్ సేకరించి నీటిని శుద్ధీకరణ చేయాలన్నారు. వచ్చే సంవత్సరం జనవరిలో 24 గంటల నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఎస్ఈ నాగమల్లేశ్వర్రావు, ఈఈ కిష్టప్ప, మహేందర్, డీజల్, ఏఈలు పాల్గొన్నారు.