Gazetted officers | కరీంనగర్ కలెక్టరేట్, మే 02 : నగరంలోని కోతిరాంపూర్ కు చెందిన ఓ చిరువ్యాపారి ఇటీవల తన కూతురు వివాహం చేశాడు. కళ్యాణలక్ష్మి పథకం ద్వారా లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేయాలనుకున్నాడు. ఇందుకోసం అవసరమైన ప్రతులు తెచ్చి ఫారం పూరించాడు. పెళ్లి తంతు వాస్తవమేనని ధృవీకరించటం మాత్రమే మిగిలింది. ఇందుకోసం తమ ప్రాంతంలోని గెజిటెడ్ హోదా కలిగిన అధికారి సంతకం చేయాల్సి ఉంది. దీనికోసం తెలిసిన వారిని అడిగితే ప్రభుత్వ పాఠశాలలో గల ప్రధానోపాధ్యాయుడిది లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యుడిదైనా, లేక ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న అధికారిదైనా సంతకం చేయించాలంటూ చెప్పగా, ఆయన పై కార్యాలయాల చుట్టూ వారం రోజుల పాటు తిరిగాడు.
అయినా, సంతకం మాత్రం చేయలేదు. చివరకు తనకు తెల్సిన మీసేవ నిర్వాహకుని వద్దకెళ్ళి విషయం వివరిస్తే.. ఓహ్ ఇంతేనా ఇదెంత పని నేను చేయిస్తా.. కాకపోతే కొంచెం ఖర్చయితది అంటూ సెలవిచ్చాడు. అయినా, మంచిదే అంటూ జేబులో నుంచి తీసి కొంత ముట్టజెప్పాడు. సదరు వ్యక్తి గంటలోపే సంతకం పని పూర్తి చేయించాడు. ఇది ఆ ఒక్క చిరువ్యాపారి బాధ మాత్రమే కాదు.. జిల్లాలో నిత్యం వందల మంది వివిధ అవసరాల నిమిత్తం గెజిటెడ్ అటెస్టేషన్ కోసం పడరాని బాధలు పడుతున్నారు.
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ తో పాటు పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకోసం, కోర్టులకు అందజేసే జిరాక్స్ ప్రతులపై, బర్త్ సర్టిఫికేట్లలో పేరు మార్చటం, పెన్షనర్ల లైఫ్ సర్టిఫికేట్ల మంజూరీకి ధృవీకరణ పత్రాలు పరిశీలించే క్రమంలో అవసరమయ్యే జిరాక్స్ ప్రతులపై కూడా గెజిటెడ్ అధికారుల సంతకం అనివార్యం కాగా, ఇందుకోసం గెజిటెడ్ హోదా కలిగిన అధికారి పని చేస్తున్న కార్యాలయాల చుట్టూ సంతకాలు అవసరమైన వారంతా నిత్యం ప్రదక్షిణలు చేయటం పరిపాటిగా మారింది.
కార్యాలయాల్లో అధికారులు వారి వారి పనుల్లో నిమగ్నమై ఉండే సందర్భాల్లో కొద్దిసేపు వేచి ఉండాలంటూ సూచించి అనంతరం వచ్చిన వారి గురించి మర్చిపోతుండగా, అధికారి పిలుపు కోసం కార్యాలయాల గుమ్మాల ఎదుట పడిగాపులు కాస్తున్న దృశ్యాలు ఇటీవలి కాలంలో పెరిగాయి. రోజురోజుకు పెరుగుతున్న పని ఒత్తిడితో కూడా అధికారులు సంతకాలు పెట్టేందుకు అంతగా ఆసక్తి కనబర్చడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, అనేక మంది కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోతున్న సందర్భాలే అధికంగా ఉంటున్నాయని వాపోతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో అయితే వారి బాధలు వర్ణనాతీతం కావడంతో, ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది మీసేవ కేంద్రాల నిర్వాహకులను ఆశ్రయిస్తున్నారు. వీరి ఇబ్బందులను ఆసరాగా చేసుకుని వారు అందినకాడికి దండుకుంటూ సంతకాలు చేయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ దందా అత్యధికంగా కొనసాగుతుండగా, అడిగినంత ముట్టజెబితేనే గెజిటెడ్ సంతకంతో కూడిన ప్రతులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇబ్బందులు భరించలేక కొంతమంది ప్రభుత్వ పథకాలకు ధరఖాస్తులు కూడా చేయటం లేదనే చర్చ కూడా జరుగుతుండటం గమనార్హం.